తెలంగాణ లోని హుజూర్ నగర్ లో ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల తంతు ఎట్టకేలకు ముగిసింది.ప్రధాన పార్టీలు గెలుపుపై టెన్షన్ ఇంకా వీడలేదు.
ముఖ్యంగా అధికార పార్టీ టిఆర్ఎస్ లో ఈ టెన్షన్ ఎక్కువగా కనిపిస్తోంది.మెజార్టీ సర్వేలన్నీ టిఆర్ఎస్ ఈ ఎన్నికల్లో గెలుస్తుందని తమ ఫలితాలను ప్రకటించినా ఆ పార్టీలో మాత్రం ఆనందం కనిపించడం లేదు.
టిఆర్ఎస్ పార్టీ కి అక్కడ సుమారు 10 వేల మెజార్టీ వస్తుందని, కాదు కాదు 20 వేల మెజార్టీ వస్తుందని ఆ పార్టీ నాయకులు ఎవరికి వారు అంచనాలు వేస్తున్నారు.పైకి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న ఆ పార్టీ నేతల్లో టెన్షన్ మాత్రం తగ్గలేదు.
దీనికి కారణం ఇండిపెండెంట్ అభ్యర్థికి దక్కిన రోడ్డు రోలర్ గుర్తే కారణమని తెలుస్తోంది.హుజూర్ నగర్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఈవీఎంలలో మొదటి ఐదు స్థానాలను కేటాయించారు.
ఐదో స్థానంలో కారు గుర్తు ఉంది.

దాని తరువాత రైతు నడిపే ట్రాక్టర్ గుర్తు, ఆ తరువాత రోడ్డు రోలర్ గుర్తు ఉన్నాయి.అయితే ఈ మూడు గుర్తుల పోలిక దాదాపు దగ్గరగా ఉండడంతో వృద్ధులు, మహిళలు, వయసుపైబడిన వారు తడబాటుకు గురయ్యి రోడ్డు రోలర్ గుర్తుకు ఓటు వేసినట్టు టిఆర్ఎస్ సర్వేలో తేలిందట.దీంతో ఇప్పుడు టిఆర్ఎస్ నాయకుల్లో ఎక్కడలేని టెన్షన్ మొదలైంది.
తమ పార్టీకి పడాల్సిన ఓట్లను ఏ మేరకు రోడ్డు రోలర్ గుర్తు తన్నుకుపోయిందా అనే విషయాన్ని అంచనా వేసే పనిలో పడ్డారు.తమ ఖాతాలో పడాల్సిన దాదాపు ఐదువేల కోట్లను రోడ్డు రోలర్ గుర్తు తన్నుకుపోయింది అనే ఒక ప్రాథమిక అంచనాకు ఆ పార్టీ నేతలు వచ్చారు.

అసలు ఈ రోడ్డు గుర్తు వంగపల్లి కిరణ్ అనే రిపబ్లిక్ పార్టీ అభ్యర్థికి దక్కింది.అలాగే అజ్మీర మహేష్ అనే రైతు బిడ్డ పార్టీ అభ్యర్థికి ట్రాక్టర్ నడిపే రైతు గుర్తు, స్వతంత్ర అభ్యర్థి లింగగిరి వెంకటేష్ కు హెలికాఫ్టర్ గుర్తు రావడంతో ఎవరెవరు ఎన్నెన్ని ఓట్లు చీల్చారో అనే విషయాన్ని లెక్క తేల్చే పనిలో పడ్డారు టీఆర్ఎస్ నాయకులు.అసలు గుర్తుల విషయంలో ఇంతగా కంగారు పడడానికి కారణం తాజాగా జరిగిన భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో రోడ్డు రోలర్ గుర్తు కారణంగా టిఆర్ఎస్ అభ్యర్థి బూరా నరసయ్య గౌడ్ ఓటమి చెందడమే కారణం ఇప్పుడు హుజూర్ నగర్ లో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందేమోనని టిఆర్ఎస్ భయపడుతోంది.