మరో 5 నిమిషాల్లో పెళ్లి అనగా...ప్రేమికులను విడదీశారు..! సినీఫక్కీలో ఏమైంది అంటే.?  

మరో ఐదు నిమిషాల్లో కోరుకున్న జీవితంలోకి అడుగుపెడుతున్నామన్న యువ జంట ఆశలు ఆవిరయ్యాయి. పెద్దలను కాదని ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకోబోతున్న జంటను అమ్మాయి తరఫు బంధువులు విడదీశారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన నిజామాబాద్‌లో బుధవారం చోటు చేసుకుంది.

-

నిజామాబాద్‌ ఆర్యసమాజ్‌‌లో పెళ్లిపీటలపై కూర్చున్న అమ్మాయిని.. ఆమె తరపు బంధువులు అందరిముందే బలవంతంగా ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్లారు. కాసేపటిలో వరుడు ఆమె మెడలో తాళి కట్టాల్సి ఉండగా.. జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం కొత్తపల్లికి చెందిన సౌజన్య, రేంజల్‌ మండలానికి చెందిన ప్రాణదీప్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే.. వీళ్ల పెళ్లిని పెద్దలు అడ్డుకుంటున్నారు. దీంతో.. ప్రేమికులు ఓ నిర్ణయానికి వచ్చారు. పెద్దలను ఎదిరించి పెళ్లిచేసుకోవాలనుకున్న సౌజన్య, ప్రాణదీప్ ‌.. నిజామాబాద్‌ ఆర్యసమాజ్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ముహూర్తం చూసి ఇవాళ పెళ్లి చేసుకునేందుకు ఆర్యసమాజ్‌ చేరుకున్నారు.

పదుల సంఖ్యలో బైక్‌లతో ఆర్య సమాజ్‌కు చేరుకున్న అమ్మాయి తరఫు బంధువులు పెళ్లిని నిలిపివేయాలంటూ ఆర్య సమాజ్‌ సభ్యులను కోరారు. ఏదైనా సమస్య ఉంటే బయట తేల్చుకోవాలని వారు చెప్పడంతో అమ్మాయిని లాక్కెళ్లబోయారు. ఇంతలో వరుడు అడ్డుపడటంతో అతన్ని చితక్కొట్టారు.

అనంతరం తమతో రావడానికి నిరాకరిస్తున్న అమ్మాయి చెంపలు వాయించారు. ఆపై భుజాన వేసుకుని బైక్‌పై ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఘటనతో ఆర్య సమాజ్‌ చుట్టుపక్కల ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బదిలీల హడావుడిలో ఉన్న పోలీసులు ఆర్య సమాజ్‌కు చేరుకోవడం ఆలస్యమైంది.