డబ్బు విషయంలో ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. డబ్బు గడ్డి తినిపిస్తుందనే సామెత తెలుగులో ఉండనే ఉంది. డబ్బు కోసం సొంత వారిని కూడా మోసం చేసిన ఘటనలు మన చుట్టూ రోజు జరుగుతూనే ఉన్నాయి. డబ్బు విషయంలో చిన్న అజాగ్రత్త వహించినా కూడా మోసపోవాల్సి వస్తుంది. నేడు మన అనుకున్న వ్యక్తి కి డబ్బు ఇస్తాం. ఆ డబ్బు ఇచ్చే సమయానికి ఆ వ్యక్తితో విభేదాలు తలెత్తితే ఆ డబ్బును రాబట్టుకోవడంకు చుక్కలు లెక్కపెట్టాల్సిందే. అందుకే మన అనుకున్నా కూడా డబ్బు ఇచ్చే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
డబ్బులు ఎవరికి ఇచ్చినా, ఎంత మొత్తంలో వడ్డీ కి ఇచ్చినా కూడా సరైన పద్దతిలో ప్రామిసరీ నోటును రాయించుకోవాల్సి ఉంటుంది. అలా ప్రామిసరి నోటు రాయించుకుంటేనే ఆ డబ్బుపై ఆశ పెట్టుకోగలం. ఒకవేళ ఆ వ్యక్తి ఇవ్వనంటూ మొండికి వేస్తే కోర్టులో ఆ ప్రామిసరి నోటుతో డబ్బును రాబట్టుకునే అవకాశం ఉంటుంది. అందుకే ప్రామిసరి నోటు రాసుకునే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
కోర్టులలో చెల్లే విధంగా ప్రామిసరి నోటు ఉండాలని, లేదంటే ఆ డబ్బులకు భద్రత లేనట్లే అంటూ న్యాయవాదులు చెబుతున్నారు. ప్రామిసరి నోట్లు రాయించుకునే సమయంలో తప్పకుండా పాటించాల్సిన కొన్ని విషయాలను మనం ఇప్పుడు చర్చిద్దాం.
ప్రామిసరి నోట్ల విషయంలో కొందరు తరచు చేసే తప్పులు ఏంటంటే ఆ నోట్లపై స్టాంపులు అతికించక పోవడం, జామీను సంతకం తీసుకోక పోవడం, సాక్షి సంతకం చేయించుకోక పోవడం. ఇక ప్రామిసరి నోటు సొంత దస్తూరితో రాయడం. ఈ నాలుగు తప్పులు చేయడం చేయకుండా ఉండాలి.
ఎంత మొత్తంకు ప్రామిసరి నోటు రాయించుకున్నా కూడా తప్పనిసరిగా స్టాంపులు అతికించాలి. స్టాంపుపై డబ్బు తీసుకున్న వ్యక్తి సంతకం చేయించుకోవాలి. ఇక ప్రామిసరి నోటులో జామీను అనే ఆప్షన్ ఉంటుంది. కాని అంతా కూడా దాన్ని పట్టించుకోరు. కాని అదే చాలా కీలకం. తప్పనిసరిగా అప్పు తీసుకున్న వ్యక్తి మరో వ్యక్తిని తన జామీనుగా ఉంచాలి. ఇక సదరు వ్యక్తికి డబ్బు ఇచ్చినట్లుగా డబ్బు ఇచ్చే వ్యక్తి ఒక సాక్షిని కూడా సంతకం చేయించాలి.
ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటీ అంటే డబ్బు తీసుకున్న వ్యక్తి ప్రామిసరి నోటును రాయాల్సి ఉంటుంది. ఒకవేళ అతను రాయకుంటే ఎవరైతే రాస్తారో వారి సంతకం ఉండాలి. అంతే కాని డబ్బు ఇచ్చే వ్యక్తి అస్సలు రాయవద్దు. ఇక లక్షకు ఒక ప్రామిసరి నోటు చొప్పున రాయించుకుంటే బెటర్. మూడు నాలుగు లక్షలకు కలిపి ఒకే ప్రామిసరి నోటును రాయించుకుంటే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. వడ్డీ ప్రభుత్వ కండీషన్స్‌కు తగ్గట్లుగా ఉండాలి. అలా కాదని అయిదు, పది రూపాయల వడ్డీని ప్రామిసరి నోటులో రాస్తే ఆ నోటు కోర్టులో చెల్లదు. అయిదు లక్షల వరకు మాత్రమే ప్రామిసరి నోట్లను వాడితే బెటర్. అంతకు మించి డబ్బు ఇస్తే 100 రూపాయల బాండ్ పేపర్‌ను వాడటం ఉత్తమం.
ఇక ప్రామిసరి నోటును డబ్బు తీసుకునే వ్యక్తి కుటుంబ సభ్యుల సమక్షంలో రాయించుకుంటే మంచిది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రామిసరి నోటు కోర్టుకు వెళ్తే కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లుగా రాయించుకుంటే ఆ డబ్బు రావడం అనుమానమే.