బట్టలపై కాఫీ మరకలను పోగొట్టే అద్భుతమైన చిట్కాలు  

ప్రతి రోజు ఉదయం లేవగానే ప్రతి ఒక్కరు కాఫీ త్రాగందే ఏ పనిలోకి వెళ్ళరు. చాలా మంది కాఫీని ఉదయం ఒకసారి,సాయంత్రం ఒకసారి త్రాగుతూ ఉంటారు.

కాఫీ త్రాగటం వలన పని ఒత్తిడి తగ్గి మైండ్ ఫ్రెష్ అవుతుందని భావిస్తారు. కాఫీ రోజుకి రెండు సార్లు త్రాగితే ఎటువంటి సమస్యలు ఉండవు. అదే ఎక్కువగా త్రాగితే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.

ఇలాంటి కాఫీ పొరపాటున బట్టలపై పడితే ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు బట్టలపై పడిన కాఫీ మరకలను సులభంగా ఎలా తొలగించుకోవాలో తెలుసుకుందాం.

బట్టలపై కాఫీ పడగానే వెంటనే చల్లని నీటితో కడిగేయాలి. ట్యాప్ వాటర్ కింద పెడితే ఆ ప్రెజర్ కి మారక తొందరగా వదిలిపోతుంది.


బట్టలపై పడిన కాఫీ మరక మీద కొంచెం బీర్ వేసి రుద్దితే మరక మాయం అవుతుంది.

ఎటువంటి మరకలను అయినా వెనిగర్ సమర్ధవంతంగా పోగొడుతుంది. కాఫీ మరక ఏర్పడిన ప్రదేశంలో వెనిగర్ వేసి రుద్దితే సులభంగా తొలగిపోతుంది.

కాఫీ మరకలను తొలగించటంలో బేకింగ్ సోడా చాలా బాగా సహాయపడుతుంది. బేకింగ్ సోడాలో గోరువెచ్చని నీటిని పోసి పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని కాఫీ మరక ఉన్న ప్రదేశంలో రాసి పావుగంట అయ్యాక ఉతికితే సులభంగా కాఫీ మరక తొలగిపోతుంది.

కాఫీ మరకలను తొలగించటానికి గుడ్డు పచ్చసొన బాగా ఉపయోగపడుతుంది. గుడ్డు పచ్చసొనను బాగా గిలకొట్టి కాఫీ మరక పడిన ప్రదేశంలో వేసి రుద్ది ఉతికితే సరిపోతుంది.

అంతేకాకుండా మార్కెట్ లో దొరికే స్టైన్ రిమూవర్ ద్వారా కూడా కాఫీ మరకలను తొలగించుకోవచ్చు. కాఫీ మరక మీద స్టైన్ రిమూవర్ రాసి పది నిముషాలు అయ్యాక ఉతికితే సరిపోతుంది.