చికెన్ / మటన్ హలీమ్ ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలి?     2017-06-08   01:18:26  IST  Raghu V

నడుస్తున్నది రంజాన్‌ సీజన్. ఈ సీజన్ లో ఎన్నోరకాల రుచికరమైన వంటకాలు అందుబాటులో ఉన్నా హలీమ్ స్పెషాలిటి, పాపులారిటి వేరు. అందులోనూ హైదరాబాద్ హలీమ్ అంటే పడిచస్తారు జనాలు. ఈ హలీమ్ ని ఇతర రాష్ట్రాలవారు, ఇంకా చెప్పాలంటే ఇతర దేశాలవారు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఈ సీజన్ లో, పూర్తిగా శాకాహారి అయితే తప్ప, హలీమ్ ముట్టని హైదరాబాదీ ఉండడు. అంత రుచికరమైన హలీమ్ ఖరీదు మాత్రం కొంచెం ఎక్కువే. చికెన్ హాలీమ్ 70-150 రూపాయలలో దొరుకుతుంది. మటన్ అయితే 90-200 రూపాయలు. ఇంత ఖర్చు పెట్టే కన్నా ఇంట్లోనే సరిపడా హలీమ్ తక్కువ ఖర్చులో చేసుకుంటే బాగుంటుంది కదా. కాని హలీమ్ ఎలా తయారుచేయాలో తెలియదా? మేం నేర్పిస్తాం.

కావాల్సినవి :

చికెన్/మటన్
కందిపప్పు
శెనెగపప్పు
ఎర్రపప్పు
మినప్పప్పు
గోధుమలు
అల్లంవెల్లులి పేస్ట్
పసుపు
ధనియాల పోడి, జీలకర్ర పొడి
బిర్యాని ఆకులు, చెక్క
ఫ్రై చేసిన ఉల్లి,
పాలు, సాఫ్రాన్
నెయ్యి

తయారు చేసే విధానం :

ముందుగా కందిపప్పు, శెనగపప్పు మినపప్పు, గోధుమలు, ఎర్రపప్పు (అన్ని 25-30 గ్రాములు) తీసుకోని ఓ నాలుగు గంటలు ఉడకబెట్టండి. ఈ మిశ్రమం బాగా ఉడికిన తరువాత మిశ్రమంతో పాటు ఆరకిలో చికెన్/బటన్ వేసి, అల్లంవెల్లుల్లి పేస్ట్, పసుపు, సరిపడా ఉప్పు వేసి, నీళ్ళ పోసి ఆరు విజిల్స్ వచ్చేవరకు మళ్ళీ ఉడకబెట్టండి. ఆ తరువాత చికెన్ నుంచి ఎముకలు తీసేయండి.

మళ్ళీ ఈ మిశ్రమాన్ని కలిపి స్టొవ్ మీద ఉండగానే నుజ్జునుజ్జు అయ్యేలా చేయండి. పేస్ట్ లా అయ్యాక అందులో చెక్క, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, బిర్యాని ఆకులు, కొంచెం సాఫ్రాన్, పాలు పోసి బాగా కలపండి. దీన్ని మరో 15 నిమిషాలు ఉడకనివ్వండి. ఆ తరువాత నెయ్యి వేసి మరో అయిదు ఆగి గ్యాస్ ఆఫ్ చేయండి. అంతే హాలీమ్ తయార్. అలంకరణ కోసం పుదీనా ఆకులు మరియు ఫ్రైడ్ ఉల్లి వేసి వేడి వేడి హలీమ్ ని లాగించేయండి.