రాజ్‌భవన్‌ రాజకీయం ... వేడెక్కుతోన్న ఢిల్లీ రాజకీయం !     2018-06-16   00:59:12  IST  Bhanu C

ఢిల్లీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కొద్దిరోజులుగా … రాజ్‌భవన్‌ రాజకీయాలను ఆపాలన్న డిమాండ్‌ ఊపందుకుంటోంది. ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ వైఖరికి నిరసనగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ చేపట్టిన ఆందోళనకు మద్దతు పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే ముగ్గురు ముఖ్యమంత్రులు కేంద్ర తీరుకు నిరసనగా తమ గళం వినిపించారు. . రాష్ట్ర ప్రభుత్వాలకు వెన్నుపోటుపొడిచే విధానాలను ఆపాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీలు ఢిల్లీ ప్రభుత్వం విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తున్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తన ముగ్గురు మంత్రులతో కలిసి జరుపుతున్న బైఠాయింపు శుక్రవారమూ కొనసాగింది. పలువరు ఆప్‌ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీలో నెలకొన్న పరిస్థితి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనంటూ రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డి) నేత జయంత్‌ చౌదరి పేర్కొన్నారు. బిజెపి మాజీ నేత యశ్వంత్‌ సిన్హా కూడా ఆప్‌ కార్యకర్తల ఆందోళనలో పాల్గొన్నారు.

రాజకీయ అవసరాలకోసం గవర్నర్‌ కార్యాలయాన్ని వాడుకునే కొత్త సంస్కృతికి బీజేపీ తెరలేపిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌ ఆందోళనకు మద్దతు తెలుపుతూ ట్వీట్‌ చేసిన వెంటనే మరో ట్వీట్‌లో రాజ్‌భవన్‌ రాజకీయాలను ఆయన ప్రస్తావించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఈ విధంగా వ్యవహరించడం రాజ్యాంగ విరుద్దమని ఆయన పేర్కొన్నారు. అలాగే.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కూడా దీనిపై లేఖాస్త్రం సంధించారు. ఢిల్లీ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు మధ్య జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించి ప్రతిష్టంభనను తొలగించాలని ఆయన కోరారు. క్రేజీవాల్ చేపట్టిన ఈ దీక్ష ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనే లేపుతోంది. అలాగే గవర్నర్ల వ్యవస్థ మీద కూడా నమ్మకం సన్నగిల్లుతోంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారం లో ఉంటే వారు చెప్పినట్టుగా చెయ్యడమే తమ పని అన్నట్టుగా ప్రస్తుతం గవర్నర్లు వ్యవహరిస్తుండడం విమర్శలపాలవుతోంది.