ఈ 9 టిప్స్ పాటిస్తే...గురక సమస్య నుండి సులభంగా బయటపడొచ్చు.! ట్రై చేయండి!       2018-06-20   00:35:56  IST  Lakshmi P

స్థూలకాయం, వయస్సు మీద పడడం, శ్వాస నాళంలో ఇబ్బందులు, సైనస్ సమస్యలు, మద్యం సేవించడం, ధూమపానం… ఇలా కారణాలు ఏమున్నా మనలో అధిక శాతం మంది గురక సమస్యతో బాధపడుతున్నారు. ఇది కేవలం వారికే వారి పక్కన నిద్రించే వారికి కూడా ఇబ్బందే. ఈ క్రమంలో గురకను తగ్గించుకోవడం ఎలాగో తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే కింద ఇచ్చిన పలు సూచనలను పాటిస్తే గురక సమస్యను ఇట్టే తగ్గించుకోవచ్చు. ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఒక గ్లాస్ నీటిలో 1, 2 పిప్పర్‌మెంట్ ఆయిల్ చుక్కలు వేసి రాత్రి నిద్ర పోయే ముందు నోటిలో పోసుకుని బాగా పుక్కిలించాలి.

2. కొద్దిగా పిప్పర్‌మెంట్ ఆయిల్‌ను చేతి వేళ్లకు రాసుకుని వాసన చూస్తున్నా గురక సమస్య తగ్గిపోతుంది.

3. అర టీస్పూన్ తేనె, అర టీస్పూన్ ఆలివ్ ఆయిల్‌లను కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి నిద్రపోయే ముందు తాగితే మంచి ఫలితం
కనిపిస్తుంది.

4. మరుగుతున్న నీటిలో 4 నుంచి 5 చుక్కల యూకలిప్టస్ ఆయిల్‌ను వేసి ఆవిరి పట్టాలి. నిద్రపోయే ముందు ఇలా చేస్తే గురక సమస్య తగ్గుతుంది.

5. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తీసుకుని అందులో అర టీస్పూన్ యాలకుల చూర్ణం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి నిద్రించే ముందు తాగితే గురక సమస్య తగ్గిపోతుంది.

6. గ్రీన్ టీ, పుదీనా టీ వంటి హెర్బల్ టీలను తాగినా గురక సమస్యను తగ్గించుకోవచ్చు.

7. సరైన భంగిమలో పడుకోకున్నా గురక వచ్చేందుకు అవకాశం ఉంటుంది. వెల్లకిలా కాకుండా ఏదైనా ఒక వైపుకు తిరిగి పడుకుంటే గురక రాదు. అంతేకాకుండా తలవైపు ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. ఇది కూడా గురక రాకుండా చూస్తుంది.

8. నిద్రించే ముందు స్నాక్స్ లాంటివి తినకూడదు. ప్రధానంగా పిజ్జాలు, బర్గర్లు, చీజ్, పాప్‌కార్న్ వంటివి అస్సలు తినరాదు. వీటిలో కొవ్వు అధికంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా మ్యూకస్ పేరుకుని గురక వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

9. నిద్రించే ముందు వీలైనంత తక్కువగా తినడం మంచిది. అతిగా తినడం వల్ల జీర్ణప్రక్రియకు ఆటంకం కలిగి శ్వాస నాళంలో అడ్డంకి ఏర్పడుతుంది. దీని వల్ల గురక వస్తుంది.