కాళ్ళ నొప్పులు తగ్గటానికి అద్భుతమైన ఇంటి చిట్కాలు       2018-06-17   22:17:19  IST  Lakshmi P

వయస్సు పెరిగే కొద్ది కాళ్ళ నొప్పులు రావటం సహజమే. అలాగే యుక్త వయస్సులో కూడా ఎక్కువ సేపు నిల‌బ‌డ‌డం, బాగా న‌డ‌వడం, వ్యాయామం ఎక్కువ‌గా చేయ‌డం వంటి కారణాలతో కాళ్ళ నొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాక పోషకాహార లోపాలు ఉన్న కాళ్ళ నొప్పులు వస్తాయి. కాళ్ళ నొప్పులు ఎలా వచ్చిన సరే కొన్ని సహజసిద్ధమైన పద్దతుల ద్వారా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఆ పద్దతుల గురించి తెలుసుకుందాం.

కాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులకు లవంగ నూనె చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నొప్పి ఉన్న ప్రాంతంలో లవంగ నూనెను రాసి పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి.

ఐస్ ముక్కలను చిన్నగా చేసి ఒక ప్లాస్టిక్ కవర్ లో వేసి నొప్పి ఉన్న ప్రాంతంలో మసాజ్ చేయాలి. ఈ విధంగా పది నిమిషాల పాటు చేస్తే సరిపోతుంది. ఐస్ ముక్కలు నొప్పులను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.

ఒక బకెట్ లో వేడి నీటిని తీసుకొని దానిలో రెండు నుండి మూడు స్పూన్ల ఎప్సం సాల్ట్ ను కలపాలి. ఆ బకెట్ లో కాళ్ళను 10 నుండి 15 నిమిషాల పాటు ఉంచాలి. కాళ్ళను బయటకి తీసిన తరువాత తేమను అందించే మాయిశ్చ‌రైజ‌ర్ క్రీమ్‌ల‌ను పాదాలకు రాయాలి. దీంతో పాదాలు మృదువుగా మారటమే కాక కాళ్ల నొప్పులు తగ్గిపోతాయి.

ఒక బకెట్ గోరువెచ్చని నీటిని తీసుకోని దానిలో రెండు స్పూన్ల వెనిగర్ వేయాలి. ఈ మిశ్రమంలో దాదాపు 20 నిమిషాల పాటూ కాళ్ళను నానబెట్టాలి. ఈ విధంగా చేయటం వలన కాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.