కోరిన కోరికలు తీర్చే ఈ ఆంజనేయ స్వామి భక్తుని కోసం చెట్టు మొదల్లో వెలిశారని తెలుసా?  

  • రామ భక్తుడు అయిన ఆంజనేయస్వామి గురించి అందరికి తెలుసు. ఆంజనేయ స్వామి ఆలయం ప్రతి గ్రామంలోను ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పే ఆంజనేయ స్వామి ఆలయం కేవలం భక్తుని కోసం వెలసిన ఆలయం. ఈ గుడికి వెళ్లి కోరిన కోరికలు తీరతాయని భక్తులకు ఒక నమ్మకం. అసలు ఈ గుడి ఎక్కడ ఉంది. ఎలా వెళ్లాలో తెలుసుకుందాం.

  • ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని, పచ్చిమగోదావరి జిల్లా, జంగారెడ్డి గూడెం మండలం ఎర్రకాలువ ఒడ్డున గురవాయిగూడెం అనే గ్రామంలో మద్ది ఆంజనేయ స్వామి గుడి ఉంది. మద్ది చెట్టు మొదలులో వెలసి ఉండుట వలన ఈ ఆంజనేయ స్వామికి మద్ది ఆంజనేయ స్వామి అని పేరు వచ్చింది. అసలు స్వామి ఎలా వెలిశారో తెల్సుకుందాం. తేత్రాయుగంలో లంకలో రాక్షసులలో కొంత మంది దైవ చింతన కలిగి ఉండేవారు. వారిలో మాద్వాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను ఎక్కువగా దైవ చింతనలో గడిపేవాడు. రామ రావణ యుద్ధం జరుగుతున్న సమయంలో రాముడు వైపు యుద్ధం చేస్తున్న హనుమంతుణ్ణి చూసిన మాద్వాసురుడు మనసు చెలించి అస్రసన్యాసము చేసి హనుమా అంటూ తనువు చాలించాడు.

  • ఆ తర్వాత ద్వాపరయుగంలో మద్వికునిగా జన్మించి కౌరవ పాండవుల యుద్ధంలో కౌరవ పక్షమున పోరాటం చేస్తున్న సమయంలో మద్వికుడు అర్జునుని జెండాపై ఉన్న ఆంజనేయ స్వామిని చూసి పునర్జన్మ గుర్తుకు వచ్చి హనుమా అంటూ ప్రాణత్యాగం చేస్తాడు. ఇక కలియుగంలో మద్యుడిగా జన్మించి భక్తి భావంతో జీవిస్తూ ఎర్ర కాలువ ఒడ్డున తపస్సు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు.


  • ప్రతి రోజు కాలువలో స్నానము చేసి స్వామి వారిని పూజించేవాడు. ఒకరోజు కాలువలో స్నానం చేసి వస్తు ఉండగా పడబోయే సమయంలో ఎవరో పట్టుకొని ఆపినట్టు అనిపిస్తుంది. తిరిగి చూస్తే ఒక వానరం మద్యుడి చేయి పట్టుకొని ఒడ్డుకు తీసుకువచ్చి సపర్యలు చేస్తూ ఉంటే… మద్యుడికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ప్రతి రోజు వానరం మద్యుడికి సపర్యలు చేస్తూ ఉంటుంది. మద్యుడు వానరాన్ని ఆంజనేయ స్వామిగా గుర్తించి ఇన్ని రోజులు మీతో నేను సేవలు చేయించుకున్నానా అని స్వామి వారి పాదాల వద్ద ఏడుస్తూ ఉంటాడు.

  • అప్పుడు ఆంజనేయ స్వామి ప్రత్యక్షం అయ్యి ననీ తప్పు ఏమి లేదు. నేనే నీ భక్తికి మెచ్చి సపర్యలు చేసానని అంటారు. ఆంజనేయ స్వామి ఏమైనా వరం కోరుకో అంటే ‘మీరెప్పుడు నా చెంతనే ఉండాలని’ కోరుకుంటాడు. అప్పుడు ఆంజనేయ స్వామి నీవు ఇక్కడ మద్ది చెట్టుగా అవతరించు. నీ మొదల్లో శిలా రూపంలో వెలుస్తానని చెప్పి అలానే వెలుస్తారు. ఈ అంజనేయస్వామి ఆలయంలో 7 మంగళవారాలు 108 ప్రదక్షిణలు చొప్పున చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.