హిందూపురం లో బాలయ్య ఓటమి తప్పదా ..?       2018-05-25   01:20:30  IST  Bhanu C

ఆయన డైలాగులు చెప్తే రీసౌండ్ వస్తుంది. ఆయన తొడ కొడితే జనాలకు ఊపు వస్తుంది. ఒంటి చేత్తో జీప్ ను లేపగల సత్తా ఆయనది. అయితే అదంతా సినిమాల్లోనే .. రియాలిటీ కి వస్తే ఆయనకు కోపం వస్తే ఆడు వీడు అని తేడా ఉండదు.. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా ..? ఎవరు కొడితే గూబ గుయ్యమంటుందో అతడే బాలయ్య ! మాములు బాలయ్య కాదు ఎమ్యెల్యే బాలయ్య అనంతపురం జిల్లా .. హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

టీడీపీకి కంచుకోట అయిన హిందూపురంలో ఎప్పుడూ టీడీపీ జెండానే ఎగురుతుంటుంది. అందుకే ఎప్పుడూ స్థానికేతరులు ఇక్కడ పోటీ చేసి సులువుగా గెలిచేస్తుంటారు. గెలిచినా ప్రతి ఒక్కరూ ఇక్కడకి చుట్టపు చూపుగా మాత్రమే వస్తుండడంతో ఈ నియోజకవర్గం అభివ్రిద్దిలో వెనుకబడిపోయింది. పోనీ ప్రస్తుత ఎమ్యెల్యే బాలకృష్ణ ఏమైనా దీనికి భిన్నంగా ఉన్నాడా అంటే అదీ లేదు. ఈయన కూడా గెస్ట్ పాత్రే పోషిస్తున్నాడు.

బాలకృష్ణ స్థానికంగా ఎప్పుడూ అందుబాటులో లేకపోవడంతో .. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని గ్రహించిన బాలకృష్ణ పీఏను ప్రజల కోసం అందుబాటులో ఉంచారు. అయితే పీఏగా ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన శేఖర్‌ ఎమ్మెల్యేకి చెడ్డపేరు వచ్చేలా వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. దీంతో ఆయనను తొలగించి ఆ స్థానంలో కృష్ణమూర్తిని, వీరయ్యను నియమించారు. కృష్ణమూర్తి నియోజకవర్గమంతా తిరిగి పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చిన తరువాత వెళ్లిపోగా, ఇప్పటికీ వీరయ్య కొనసాగుతున్నారు.

హిందూపురంలోని చౌడేశ్వరికాలనీలో బాలకృష్ణ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వచ్చిన ప్రతిసారీ రెండుమూడు రోజులు ఉండి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు మాత్రమే ఆయన పరిమితం అయిపోయాడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ పెద్దగా నెరవేర్చకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. హిందూపురం ప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేరలేదు.
నిరుద్యోగ యువత కోసం ఎన్టీఆర్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ ఏర్పాటు, ప్రతి ఇంటికీ ఎన్టీఆర్‌ సుజల స్రవంతి శుద్ధజలం, ప్రభుత్వ బాలుర జూనియర్‌, డిగ్రీ కళాశాల, పట్టణంలో రోడ్ల విస్తరణ వంటివాటిని ఇంకా నెరవేర్చలేదు. హిందూపురం నుంచి బెంగళూరుకు ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌, మార్కెట్‌ యార్డులో రైతుల కోసం సౌకర్యలు ఏర్పాటు చేయలేదు. ప్రతి మండలానికీ గార్మెంట్‌ పరిశ్రమ ఏర్పాటు అంశం కూడా ఎమ్మెల్యే హామీల్లో ప్రధానమైనది. కానీ ఇవేవి నెరవేర్చే అంత ఆసక్తి బాలయ్య చూపడంలేదు. అసలు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ బాలయ్యకు సీటు ఇచ్చే సూచనలు కనిపించడంలేదని తెలుగుదేశం వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.