అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో( US Elections ) రెండో సారి విజయం సాధించాలని చూస్తోన్న జో బైడెన్( Joe Biden ) అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు.అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో అమెరికా వైఖరి కారణంగా ముస్లిం అమెరికన్ల నుంచి బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌కు ఎదురుదెబ్బ తగులుతుందని నిపుణులు భావిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో బైడెన్ గెలుపులో హిందూ అమెరికన్లు కీలకపాత్ర పోషించాల్సి వుందని ఓ భారత సంతతికి చెందిన డెమొక్రాటిక్ పార్టీ నేత పేర్కొన్నారు.డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ (డీఎన్‌సీ) శీతాకాల విడిదికి హాజరుకావడానికి వాషింగ్టన్‌కు వచ్చిన మసాచుసెట్స్‌కు చెందిన రమేష్ కపూర్ మాట్లాడుతూ.
హిందూ అమెరికన్లు, భారతీయ అమెరికన్లు సాంప్రదాయంగా డెమొక్రాట్లకు గట్టి మద్ధతుదారులని తెలిపారు.అయితే గత కొన్ని ఎన్నికల్లో వారి ఓటు బ్యాంక్ రిపబ్లికన్ల వైపు మొగ్గు చూపిందన్నారు.
బైడెన్ చేత వైట్‌హౌస్‌లో స్వయంగా హాలిడే పార్టీకి ఆహ్వానం అందుకున్న రమేశ్ కపూర్( Ramesh Kapur )బైడెన్ తిరిగి గెలవడానికి హిందూ ఓట్లు కీలకమన్నారు.దీనిపై డీఎన్‌సీ, పార్టీ నేతలకు వివరణాత్మక నివేదికను సమర్పించినట్లు ఆయన జాతీయ వార్తా సంస్ధ పీటీఐకి తెలిపారు.అక్టోబర్‌లో కుల వివక్షను చట్టవిరుద్ధం చేసే బిల్లును వీటో చేయడానికి కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్( Gavin Newsom )ను ఒప్పించడం వెనుక తాను కీలకపాత్ర పోషించానని కపూర్ చెప్పారు.వాస్తవాలతో కూడిన నివేదికను పార్టీ అగ్రనాయకత్వానికి సమర్పించడంతో పాటు ప్రచార సరళిపై కొన్ని సిఫార్సులు చేశానని ఆయన వెల్లడించారు.
బైడెన్ పరిపాలనకు హిందూ అమెరికన్లు మద్ధతునిచ్చేలా తాను ప్రయత్నిస్తున్నానని రమేశ్ తెలిపారు.వాస్తవానికి గత ఎన్నికల్లో 72 శాతం మంది భారతీయ అమెరికన్లు బైడెన్ వైపు మొగ్గు చూపారని కపూర్ గుర్తుచేశారు.డెమొక్రాటిక్ పార్టీ హిందువులకు వ్యతిరేకం అనే అభిప్రాయం అక్కడ వున్నందున తాము కొంత కష్టపడాల్సి వుందని అభిప్రాయపడ్డారు.ఈ అభిప్రాయాన్ని మార్చడానికి బైడెన్ ప్రచార బృందంతో మాట్లాడానని కపూర్ చెప్పారు.
జనాభా లెక్కల ఆధారంగా తాను సర్వే చేశానని, రాష్ట్రాల వారీగా ముస్లిం, హిందూ ఓట్లు వచ్చాయని కపూర్ పేర్కొన్నారు.టగ్ ఆఫ్ వార్ నడిచే రాష్ట్రాల్లో ముస్లిం ఓటర్ల కంటే హిందువులు తక్కువ కాదని ఆయన తెలిపారు.
విస్కాన్సిన్, జార్జియా, పెన్సిల్వేనియా, ఆరిజోనా రాష్ట్రాల్లో వారి ప్రభావం ఎక్కువని కపూర్ అన్నారు.