హీరోలు కావ‌లెను! క‌ర్ణాట‌క‌లో అన్ని పార్టీల కామ‌న్‌ నినాదం..       2018-05-04   00:39:30  IST  Bhanu C

హీరోలు కావ‌లెను!! అయితే, ఇదేదో సినిమాల్లో న‌టించేందుకు మాత్రం కాదు. రాజ‌కీయాల్లో ప్ర‌చారం చేసేందుకు! ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌లు అన్ని రాజ‌కీయ పార్టీల‌కూ ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. అధికార పీఠం కోసం ఏ పార్టీకి ఆ పార్టీ ఎత్తులు పై ఎత్తులు వేస్తూ.. ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించే ప‌నిలో ప‌డ్డాయి. ఈ క్ర‌మంలోనే త‌మ ఒక్క‌రి వ‌ల్ల ప్ర‌చారం స‌రిపోద‌ని, ప్ర‌జ‌లు ఫిదా కాలేర‌ని గ్ర‌హించిన నేత‌లు.. ఇప్పుడు రాజ‌కీయ పార్టీల‌కు తోడుగా సినీ ఇండ‌స్ట్రీని కూడా రంగంలోకి దింపారు. ఈ క్ర‌మంలో శాండిల్ ఉడ్‌కి చెందిన ప్ర‌ముఖ తార‌లు రాజ‌కీయ నాయ‌కుల ప‌క్షాన పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. వీరిలో కొంద‌రు పార్టీల్లో చేరిన వారు ఉండ‌గా మ‌రికొంద‌రు మాత్రం త‌ట‌స్థంగా ఉన్నారు. ఇలా ప్ర‌చారం చేస్తున్న వారిలో ఒక‌రిద్ద‌రు ఏకంగా టైం చూసుకుని రెండు పార్టీల అభ్య‌ర్థుల‌కు కూడా ప్ర‌చారం చేస్తున్నారు.

-

ద‌క్షిణాదిలో అందునా క‌ర్ణాట‌క‌లో హీరోలు ఏం చెప్పినా ప్ర‌జ‌లు వెంట‌నే రిసీవ్ చేసుకుంటారు. అందుకే ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ మంది మూవీ ఆర్టిస్టులు రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన రాష్ట్రం క‌ర్ణాట‌కే! చాలా మంది హీరోలు, సీనియ‌ర్ ఆర్టిస్టులు, హీరోయిన్లు కూడా ప‌లు పార్టీల్లో స‌భ్య‌త్వం క‌లిగి ఉండ‌డం విశేషం. వీరిలో చాలా మంది టికెట్లు కూడా పొంది బ‌రిలో నిలిచి త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు. వీరిలో ర‌మ్య శ్రీ(కాంగ్రెస్‌) త‌ర‌ఫున చాలా పెద్ద పేరు తెచ్చుకుంది. అదేవిధంగా బాగ‌ల్‌కోట్ నుంచి బ‌రిలో నిలిచిన డైలాగ్ కింగ్ సాయి కుమార్ గురించి వేరే చెప్పాల్సిన ప‌నిలేదు.బీజేపీ అభ్య‌ర్థిగా ఈయ‌న పోటీ చేస్తున్నాడు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయినా.. మ‌రో సారి ఆయ‌న‌కు బీజేపీ టికెట్ ఇచ్చిందంటే రీజ‌న్ అర్ధ‌మ‌వుతుంది.

ఇక‌, రాజ‌కీయ నాయ‌కుల‌కు ప్ర‌చారం చేసి పెట్టేందుకు కొంద‌రు హీరోలు రంగంలోకి దిగారు.అయితే, ఒక‌రిద్ద‌రి కోసం.. రెండు మూడు పార్టీలు క్యూక‌ట్ట‌డంతో సీన్ మ‌రింత ర‌క్తి క‌డుతోంది. వారు హీరోల‌ను వ‌దులుకోలేరు. వీరు రాజ‌కీయ నేత‌ల‌ను కాద‌న‌లేరు. దీంతో ఒకే హీరో రెండు పార్టీల‌కు , ఇద్ద‌రు అభ్య‌ర్థుల‌కు సైతం ప్ర‌చారం చేయాల్సి రావ‌డం రాజ‌కీయ చ‌రిత్రలో తొలిసారి అని చెప్ప‌క‌త‌ప్ప‌దు. స్యాండిల్ వుడ్ కు చెందిన ప్రముఖ హీరో రాకింగ్ స్టార్ యశ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తాను ఏ ఒక్క పార్టీ తరపున ప్రచారం చెయ్యను అంటూ ఇంతకాలం చెబుతూ వచ్చినా.. నేత‌ల ఒత్తిళ్ల‌కు ఆయ‌న త‌లొగ్గ‌క త‌ప్ప‌లేదు. దీంతో ఏకంగా రెండు ప్రముఖ పార్టీలకు ప్రచారం చెయ్యాలని నిర్ణయించారు. కేఆర్ నగర్ నియోజక వర్గంలో జేడీఎస్ పార్టీ టిక్కెట్ పై పోటీ చేస్తున్న మహేష్ ను గెలిపించాలని రాకింగ్ స్టార్ యశ్ ప్రజలకు మనవి చేశారు.

కేఆర్ నగర్ నియోజక వర్గంలో జేడీఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న సా.రా. మహేష్ కు మద్దతుగా ఓపెన్ టాప్ జీపులో ఎండను లెక్కచెయ్యకుండా ప్రముఖ రహదారుల్లో రాకింగ్ స్టార్ యశ్ సంచరిస్తూ ప్రచారం చేశారు. మహేష్ ను గెలిపిస్తే మీకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తాడని, ఓటు కచ్చితంగా ఆయనకే వెయ్యాలని రాకింగ్ స్టార్ యశ్ స్థానిక ఓటర్లకు మనవి చేశారు. ఇక‌, ఇప్పుడు సీన్ క‌ట్ చేస్తే.. మైసూరులోని కేఆర్(కృష్ణరాజ) నియోజక వర్గం నుంచి బీజేపీ టిక్కెట్ పై పోటీ చేస్తున్న మాజీ మంత్రి రామదాస్ కు మద్దతుగా ప్రచారం చెయ్యడానికి సిద్దం అయ్యారు.

మైసూరు లోని గన్ హౌస్ సర్కిల్ నుంచి రాకింగ్ స్టార్ యశ్ రోడ్ షో నిర్వహించి రామదాస్ కు మద్దతుగా ప్రచారం చెయ్యడానికి సిద్దం అయ్యారు. స్యాండిల్ వుడ్ లో ప్రముఖ హీరోనే కాకుండా రాకింగ్ స్టార్ సొంత ఊరు మైసూరు కావడంతో ఆయనతో ప్రచారం చేయించడానికి వివిద పార్టీలు పోటీ పడుతున్నాయి. సో.. ఇలా హీరోలు ఒక‌టి కాదు.. ఏకంగా రెండు మూడు పార్టీల‌కు ప్ర‌చారం చేయాల్సి రావ‌డం.. క‌న్న‌డ‌లోనే క‌నిపిస్తోంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.