తెలుగు రైతులపై హీరో విశాల్ కీలక నిర్ణయం.!       2018-06-11   00:31:59  IST  Raghu V

హీరో విశాల్, సమంత జంటగా నటించిన “అభిమన్యుడు” సినిమా ఇటీవలే విడుదలయ్యి ఆడియన్స్ ని ఆకట్టుకుంది. విశాల్ నటనను మెచ్చుకున్న ఆడియన్స్ ఇప్పుడు విశాల్ చేసిన మంచి పనిని మరింత మెచ్చుకుంటున్నారు. అదేంటో చూస్తే మీరు శబాష్ అంటారు.!

తమిళ, తెలుగు హీరో విశాల్.. తెలుగు రైతులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ‘అభిమన్యుడు’ సినిమా టికెట్‌పై రూపాయి చొప్పున రైతులకు సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. విశాల్ నటించిన ‘అభిమన్యుడు’ ఇటీవల తెలుగులో విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. తొలివారంలోనే రూ.12 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఈ చిత్రం సాధించిన వసూళ్లలో లాభాలను రైతులకు పంచాలని విశాల్ భావించారు. ఈ మేరకు సినిమా టికెట్‌పై రూపాయి చొప్పున రైతులకు అందిస్తామని తెలిపారు. దీంతో ఆయన నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

కాగా ‘అభిమాన్యుడు’ చిత్రం.. సైబర్ మోసాల నేపథ్యంలో తెరకెక్కింది. బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులు సైబర్ నేరగాళ్లు కొట్టేస్తున్నదానిపై కళ్లకు కట్టినట్లు ఈ చిత్రంలో చూపించారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం, ఇతర అంశాలపై సామాన్యులు పడుతున్న ఇబ్బందులపై కూడా సినిమాలో చూపించారు. దీంతో ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.