ప్రముఖ తమిళ్ హీరో విజయ్ ఒక రాజకీయ పార్టీ పెట్టాడని మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర కూడా తన పార్టీని పేరును ఇప్పటికే రిజిస్టర్ చేయించాడని ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి.
తమిళంలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్‌కు అక్కడ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.ఇక తెలుగులో విడుదలైన విజయ్ సినిమాలు చాలా పెద్ద విజయం సాధించాయి.
దీంతో తమిళం, తెలుగు ప్రజలకు విజయ్ సుపరిచితమే.
హీరో విజయ్ పార్టీ పెడతాడనే ప్రచారం ఎప్పటినుంచో ఉంది.
త్వరలో తమిళనాడు ఎన్నికలు రానున్న క్రమంలో విజయ్ కొత్త పార్టీ పెట్టాడనే వార్తలు గుప్పుమనడంతో అందరూ దీనిని నమ్మారు.అయితే తాను కొత్త పార్టీ పెట్టినట్లు వస్తున్న వార్తలపై తాజాగా హీరో విజయ్ స్పందించాడు.
తాను కొత్త రాజకీయ పార్టీ పెట్టలేదని, తన తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్ ఓ రాజకీయ పార్టీ పెట్టారని, అయితే దానితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నాడు.
ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ పార్టీకి సంబంధించిన ఏ విషయంలోనూ తాను పాలుపంచుకోవడం లేదని, తన తండ్రి పార్టీ ప్రారంభించారనే విషయం మీడియా ద్వారానే తనకు తెలిసిందని విజయ్ తెలిపాడు.
తన తండ్రి రాజకీయ పార్టీ కదా అని తన అభిమానులు ఎవరూ బలవంతంగా పార్టీలో చేరాల్సిన అవసరం లేదన్నాడు.నచ్చితే చేరవచ్చని చెప్పాడు.
తన తండ్రి భవిష్యత్తులో తీసుకునే ఎలాంటి రాజకీయ నిర్ణయం తనకు అవరోధం కాబోదని విజయ్ పేర్కొన్నాడు.