చరణ్‌ అధికారిక ప్రకటన  

పవన్‌ కళ్యాణ్‌ నిర్మాణంలో రామ్‌ చరణ్‌ నటించనున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఈ వార్తలను మెగా ఫ్యాన్స్‌ నమ్మలేకుండా ఉన్నారు. ఇది నిజమా లేక పుకారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రామ్‌ చరణ్‌ తాజాగా తాను బాబాయి నిర్మాణంలో ఒక సినిమాలో నటించబోతున్నట్లుగా ప్రకటించాడు. బాబాయితో సినిమా చేసేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానంటూ ఫేస్‌బుక్‌ ద్వారా పేర్కొన్నాడు. చరణ్‌ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్‌ సంతోషంలో మునిగి తేలుతున్నారు.

ప్రస్తుతం ‘నా పేరే రాజు’ సినిమాలో నటించేందుకు సిద్దం అవుతున్న చరణ్‌ ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌ నిర్మాణంలో నటించనున్నాడు. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ టీం చరణ్‌ కోసం ఒక మంచి కథను సిద్దం చేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత పవన్‌ తన నిర్మాణ సంస్థలో వరుసగా చిన్న హీరోల మరియు దర్శకులతో సినిమాలు నిర్మించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ హీరోగా త్వరలో ‘గబ్బర్‌సింగ్‌`2’ ప్రారంభం కాబోతున్న విషయం తెల్సిందే.