టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్, ఆయన కుటుంబం అక్టోబర్ నెల మూడవ వారంలో కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.అయితే ఆయన కుటుంబ సభ్యులు త్వరగానే కోలుకున్నా మొదట్లో రాజశేఖర్ పరిస్థితి విషమించినట్లు వార్తలు వచ్చాయి.
అయితే రాజశేఖర్ ఎట్టకేలకు కరోనాను జయించి గత నెల 9వ తేదీన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.ప్లాస్మా థెరపీ తీసుకోవడం వల్ల రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది.అయితే కరోనా నెగిటివ్ వచ్చినా ఆయనను ఇతర ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.నిన్న జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా భార్యతో కలిసి ఓటు వేయడానికి వచ్చిన రాజశేఖర్ కరోనా వైరస్ వల్ల తన ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయినట్టు వెల్లడించారు.
కరోనా నెగిటివ్ వచ్చిన తరువాత పూర్తిగా ఇంటికే పరిమితమయ్యానని ఓటు హక్కును వినియోగించుకోవాలని భావించి ఓటు వేయడానికి వచ్చానని రాజశేఖర్ తెలిపారు.
అభిమానుల ప్రేమ, ఆప్యాయతలే తాను కరోనా నుంచి త్వరగా కోలుకోవడానికి కారణమయ్యాయని రాజశేఖర్ అన్నారు.కరోనా నెగిటివ్ వచ్చిన తరువాత కూడా ఆక్సిజన్ తీసుకున్నానని.రెండు రోజుల నుంచి ఆక్సిజన్ తీసుకోకుండానే ఇంట్లో తిరుగుతున్నానని అన్నారు.
ఓటు కనీస బాధ్యత కావడంతో జీవితకు చెప్పి ఓటు వేయడానికి వచ్చానని అన్నారు.ఊపిరితిత్తులు నార్మల్ కావడానికి ఇంకా రెండు నెలల సమయం పడుతుందని ఎక్కువగా మాట్లాడలేకపోతున్నానని చెప్పారు.కరోనా వైరస్ నుంచి కోలుకున్నా చాలామందిని ఇతర ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.కరోనా వైరస్ ఎక్కువగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతోంది.50 సంవత్సరాల వయస్సు పైబడిన వాళ్లు కరోనా నుంచి కోలుకున్నా ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు.ప్రస్తుతం హీరో రాజశేఖర్ వయస్సు 58 సంవత్సరాలు.
మరోవైపు గత కొంతకాలంగా హిట్లు లేక కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న రాజశేఖర్ పూర్తిగా కోలుకున్న తరువాత కొత్త సినిమా కథలను విననున్నారని సమాచారం.