అల్లుడు గారు ఆదుకోండి మహాప్రభో..       2018-06-14   02:54:48  IST  Raghu V

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ నటించిన ‘కాలా’ చిత్రం తెలుగులో అట్టర్‌ ఫ్లాప్‌ అని తేలిపోయింది. తమిళంలో కాస్త పర్వాలేదు అనిపించుకున్నా కూడా, తెలుగులో మాత్రం ఈ చిత్రం దారుణమైన కలెక్షన్స్‌ను రాబట్టింది. డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేసిన మొత్తంలో కనీసం 15 శాతం కూడా వసూళ్లు సాధించలేదని తెలుస్తోంది. ఇంత దారుణమైన పరాజయంతో డిస్ట్రిబ్యూటర్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయమై డిస్ట్రిబ్యూటర్లు నిర్మాత ధనుష్‌ వద్దకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. కాలా చిత్రానికి నిర్మాత అయిన ధనుష్‌ సినిమా విడుదలకు ముందు అన్ని ఏరియాల్లో కూడా భారీ మొత్తానికి సినిమాను అమ్మేసి భారీగా లాభాలను దక్కించుకున్నాడు.

-

‘కాలా’ చిత్రాన్ని కేవలం 60 కోట్లతో నిర్మించిన ధనుష్‌ తెలుగు రైట్స్‌ను ఏకంగా 30 కోట్లకు అమ్మేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో కనీసం 5 కోట్ల వసూళ్లు కూడా సాధించలేదు. అందుకే డిస్ట్రిబ్యూటర్లు నిర్మాత ధనుష్‌ వద్దకు వెళ్లి తమకు వచ్చిన నష్టంలో కనీసం సగ భాగం అయినా షేర్‌ చేసుకోవాలని, తమకు ఆర్థిక సాయం చేయకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటాం అంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో వారు రజినీకాంత్‌తో మాట్లాడి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకొచ్చారు.

గతంలో రజినీకాంత్‌ నటించిన చిత్రాలు అట్టర్‌ ఫ్లాప్‌ అయితే వాటి వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు పిలిచి కొద్ది మొత్తంలో అయినా సాయం చేసేవాడు. కాని ఈ సినిమాకు నిర్మాత తన అల్లుడు అవ్వడం వల్ల ఏం చేయలేక పోతున్నట్లుగా తెలుస్తోంది. ఇతర నిర్మాతలతో అయితే కాస్త ఒత్తిడి తీసుకు వచ్చి డిస్ట్రిబ్యూటర్లకు న్యాయం చేయించే రజినీకాంత్‌ ఈసారి మాత్రం తన వల్ల కాదు అంటూ చేతులు ఎత్తేసినట్లుగా తెలుస్తోంది. తెలుగు డిస్ట్రిబ్యూటర్లతో పాటు మరి కొందరు కూడా రజినీకాంత్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

రజినీకాంత్‌ చేతులు ఎత్తేయడంతో అల్లుడు గారు మీరే మాకు దిక్కు అనుకుంటూ ధనుష్‌ను డిస్ట్రిబ్యూటర్లు ఆశ్రయించారు. డిస్ట్రిబ్యూటర్లను సంతృప్తి పర్చాలి అంటే నిర్మాత ధనుష్‌ ఏకంగా 40 కోట్ల మేరకు వెనుక్కు ఇవ్వాల్సి ఉంటుందట. ఇంత మొత్తంలో వెనక్కు ఇచ్చేస్తే తమకు మిగిలేది ఏంటీ అంటూ నిర్మాత సన్నిహితుల వద్ద చెబుతున్నట్లుగా సమాచారం అందుతుంది. డిస్ట్రిబ్యూటర్లు అరిచి మొత్తుకున్నా కూడా ధనుష్‌ మాత్రం పైసా ఇచ్చే పరిస్థితి లేదని, రజినీకాంత్‌నే మరోసారి ఆశ్రయించాలని డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించుకున్నారు. అందుకే మళ్లీ కలుస్తాం అంటూ డిస్ట్రిబ్యూటర్లు రజినీకాంత్‌ సమయం కోరినట్లుగా తెలుస్తోంది. ఆదివారం నాడు రజినీకాంత్‌ను కలిసేందుకు డిస్ట్రిబ్యూటర్లు అంతా మళ్లీ సిద్దం అవుతున్నారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.