యాత్రకు అంత బడ్జెట్టా? వైకాపా ప్రమేయం ఉందా?       2018-07-08   00:28:59  IST  Bhanu C

బయోపిక్‌లు కొన్ని సార్లు అంతగా ఆకట్టుకోలేక పోవచ్చు. అయితే కొన్ని సార్లు మాత్రం భారీ విజయాలను దక్కించుకునే అవకాశం ఉంది. ఇటీవలే విడుదలైన ‘మహానటి’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు 20 కోట్ల బడ్జెట్‌తో ఆ చిత్రాన్ని నిర్మించారు. సావిత్రి జీవితాన్ని 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించి తప్పు పని చేశారని, అసలు అలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నారు అంటూ కొందరు అశ్వినీదత్‌ను ప్రశ్నించారు. కాని ఆయన నమ్మకం వమ్ము కాలేదు. 20 కోట్లు పెడితే ఏకంగా 50 కోట్ల మేరకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అంతటి విజయాన్ని సాధించిన మహానటి దారిలోనే రాజశేఖర్‌ రెడ్డి ‘యాత్ర’ కూడా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాజశేఖర్‌ రెడ్డి బయోపిక్‌ను విజయ్‌ అనే ఒక చిన్న నిర్మాత నిర్మించేందుకు సిద్దం అయ్యాడు. యాత్ర టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంను ఏకంగా 30 కోట్ల బడ్జెట్‌తో ఆయన నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. మలయాళ స్టార్‌ హీరో మమ్ముటి మరీయు తమిళ స్టార్‌ సూర్యలు ఈ చిత్రంలో కీలకంగా కనిపించబోతున్నారు. ఇంకా పలువురు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటించనున్న కారణంగా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే బడ్జెట్‌ విషయంలో ఎలాంటి ఆలోచన లేకుండా 30 కోట్లకు పైగానే పెట్టేందుకు నిర్మాత సై అంటున్నాడు.

‘యాత్ర’ సినిమా బడ్జెట్‌ భారీ తనం వెనుక వైకాపా ఉండి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. నిర్మాత విజయ్‌ తప్పకుండా జగన్‌ ఆశ్శీస్సులతోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉంటాడని, ఖచ్చితంగా పూర్తి బడ్జెట్‌ను వైకాపా నుండి అందించే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. లేదంటే వైఎస్‌ జగన్‌ సొంత నిధులు అయినా ఇటు మళ్లించే అవకాశం ఉంటుందని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. కాని రాజశేఖర్‌ రెడ్డిపై ఉన్న అభిమానంతోనే తాను సొంతంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను అని, వైకాపా వారికి ఈ చిత్రానికి సంబంధం లేదని, అసలు ప్రస్తుత రాజకీయాలకు ఈ చిత్రంతో పొంతన ఉండదు అంటూ చెబుతున్నాడు.

నిర్మాత ఎంతగా చెప్పినా, ఎన్ని విషయాలు చెబుతున్నా కూడా ఖచ్చితంగా ఇది వైకాపా అండదండలతో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌ అంటూ కొందరు టీడీపీ నాయకు కూడా అప్పుడే విమర్శలు మొదలు పెట్టారు. 70 రోజులు ఏకధాటిగా చిత్రీకరణ జరిపి ఇదే సంవత్సరం చివర్లో చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. అనసూయ, రావు రమేష్‌ ఇంకా ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కనిపించబోతున్నారు.