అల్లుడిని హరీష్‌కు అప్పగించిన చిరు!       2018-06-27   01:15:53  IST  Raghu V

మెగాస్టార్‌ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ రెండవ భర్త కళ్యాణ్‌పై ఎక్కువ శ్రద్ద కనబర్చుతున్నాడు. హీరో అవ్వాలనే కోరిక కళ్యాణ్‌లో ఎక్కువగా ఉందనే విషయాన్ని గుర్తించి, యాక్టింగ్‌లో శిక్షణ ఇప్పించి, ‘విజేత’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు. ‘విజేత’ చిత్రంకు సంబంధించిన పూర్తి విషయాలను దగ్గరుండి మరీ చిరంజీవి చూసుకున్నారు. నిర్మాత సాయి కొర్రపాటికి నిర్మాత బాధ్యతలు అప్పగించినా కూడా అల్లు అరవింద్‌ను పర్యవేక్షణ చేయాల్సిందిగా ఆదేశించాడు. చిరంజీవి తన అల్లుడు కళ్యాణ్‌పై తన ఇతర వారసుల కంటే ఎక్కువ ఫోకస్‌ చేస్తున్నాడని కొన్ని సంఘటనలు చూస్తుంటే అనిపిస్తుంది.

మొదటి సినిమాను కాస్త చిన్నగా, సాదా సీదా బడ్జెట్‌తో ప్లాన్‌ చేసిన మెగాస్టార్‌ తన అల్లుడు రెండవ సినిమాను మాత్రం భారీగా ప్లాన్‌ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాలకు పెట్టింది పేరు అయిన హరీష్‌ శంకర్‌తో కళ్యాణ్‌ రెండవ సినిమా ఉంటుందని సమాచారం అందుతుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతతో నిర్మింపజేస్తున్నాడు. ఆ నిర్మాతపై ప్రేక్షకుల్లో భరోసా ఉంది. అందుకే ఆ నిర్మాత సినిమాను టోకేవర్‌ చేస్తే ఖచ్చింగా కళ్యాణ్‌ కెరీర్‌ బాగుంటుందనే అభిప్రాయంలో చిరంజీవి ఉన్నాడు. అందుకే ఫైనాన్స్‌ చేయడంతో పాటు, అనధికారికంగా సినిమాలో భాగస్వామి అయ్యి ఆ నిర్మాతతో సినిమాను నిర్మింపజేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

‘విజేత’ చిత్రం విడుదలకు దగ్గర పడుతున్న సమయంలో చిరంజీవి కూడా కాస్త టెన్షన్‌ పడుతున్నట్లుగా అనిపిస్తుంది. జులై 12న విడుదల కాబోతున్న ‘విజేత’ చిత్రం కళ్యాణ్‌కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మెగా ఫ్యామిలీ మొత్తం మాత్రం కాస్త టెన్షన్‌తో ఉన్నారు. మొదటి సినిమా అటు ఇటు అయితే కెరీర్‌ మొత్తం ఊగిసలాట అవుతుందని, మొదటి సినిమాతోనే సక్సెస్‌ను దక్కించుకుంటే ఇక కెరీర్‌ మొత్తం సక్సెస్‌ఫుల్‌గా దూసుకు పోవచ్చు అనే ఉద్దేశ్యం ఎక్కువ మందిలో ఉంటుంది. ఇప్పుడు అదే అభిప్రాయంతో మెగా ఫ్యామిలీ కూడా టెన్షన్‌లో ఉన్నట్లుగా అనిపిస్తుంది.

కళ్యాణ్‌ దేవ్‌ రెండవ సినిమాకు హరీష్‌ శంకర్‌ స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో ఉన్నాడు. అల్లు అర్జున్‌తో ‘డీజే’ చిత్రం చేసిన తర్వాత ఖాళీగానే ఉన్న హరీష్‌ శంకర్‌ ఆ మద్య ‘దాగుడు మూతలు’ అనే మల్టీస్టారర్‌ను చేయాలని భావించాడు. అయితే ఆ సినిమాను ప్రస్తుతానికి పక్కన పెట్టి బన్నీతో సినిమాను చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. ఆ వార్తలు కూడా నిజం కావని, బన్నీ ప్రస్తుతం విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో సినిమాకు సిద్దం అవుతున్నట్లుగా తేలిపోయింది. ఈ సమయంలోనే కళ్యాణ్‌తో హరీష్‌ మూవీ ఉంటుందని తేలిపోయింది. ఆగస్టులో సినిమాను పట్టాలెక్కించేలా ప్లాన్‌ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను విడుదల చేస్తారేమో చూడాలి.