ఆ మంత్రిని ఓడించేందుకు హ‌రీశ్ స్కెచ్‌       2018-04-20   23:35:20  IST  Bhanu C

కేసీఆర్ చేతిలో ప‌దునైన ఆయుధం హ‌రీశ్‌రావు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న ఉద్య‌మంలో ఈ విష‌యం అనేక‌సార్లు రుజువ‌యింది. అనేక క‌ష్ట కాలాల్లో కేసీఆర్‌ను ఆ ఆయుధ‌మే కాపాడింది. అనేక ప్ర‌తికూల ప‌రిస్థితుల నుంచి బ‌య‌ట‌ప‌డేసింది. ప్ర‌త్య‌ర్థుల‌ను మ‌ట్టిక‌రిపించింది. అందుకే ఏదైనా సంక్లిష్ట స‌మ‌స్య ఎదురైతే సీఎం కేసీఆర్ ప్ర‌యోగించేది హ‌రీశ్‌రావు అనే ప‌దునైన ఆయుధాన్నే. ఉద్య‌మ స‌య‌మంలో జ‌రిగిన ఎన్నిక‌లు, ఉప ఎన్నిక‌ల్లో ఓడిపోయే స్థానాల్లోనూ టీఆర్ఎస్‌ను ఒంటిచేత్తో గెలిపించిన స‌మ‌ర్థుడు హ‌రీశ్‌రావు. అదేన‌మ్మ‌కంతో తాజాగా సీఎం కేసీఆర్ మ‌రొక బాధ్య‌త హ‌రీశ్‌కు అప్ప‌గించాడ‌ని టాక్‌. అదేమిటంటే.. కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రి, ఎమ్మెల్యే గీతారెడ్డిని ఓడించడం.

ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలో జ‌హీరాబాద్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట‌. ఈ జిల్లాలో అన్ని సీట్లలో గులాబీ జెండా ఎగిరినా.. జ‌హీరాబాద్‌ ప్రజలు మాత్రం గీతారెడ్డినే ఆదరించారు. గీతారెడ్డి నియోజకవర్గంపై పట్టు జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ టీఆర్ఎస్ పార్టీకి సవాల్‌ విసురుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే సీఎం కేసీఆర్ ఈ నియోజ‌క‌వ‌ర్గంపై ప్రత్యేకంగా ద‌`ష్టి సారించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గీతారెడ్డిని ఓడించే బాధ్య‌త‌ను మంత్రి హ‌రీశ్‌రావుకు అప్ప‌గించిన‌ట్లు తెలిసింది.

ఈ మధ్యే జహీరాబాద్‌ నియోజకవర్గంలోఆయ‌న‌ రెండు రోజులు పర్యటించారు. టౌన్‌లో సైకిల్‌పై వాడ‌వాడలా ప‌ర్య‌టించారు. ఒకేరోజు 406 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అంద‌జేశారు. ఒక్కరోజులో రూ.60 కోట్ల విలువైన పనులకు అనుమతులు లభించాయి. ప్రభుత్వ ఆస్పత్రిలో కేవలం 15 గంటల్లోనే డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసి.. ప్రారంభోత్సవం కూడా నిర్వహించారు. ఇలా చ‌క‌చ‌కా ప‌నులు జ‌ర‌గ‌డంలో ఆంత‌ర్య‌మిదేన‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.

గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా మంత్రి హ‌రీశ్‌రావు ప‌ర్య‌టించ‌డం, నిధులు వెల్లువ‌లా మంజూరుకావడం, టీఆర్ఎస్ నేత‌ల హ‌డావుడి పెర‌గ‌డంపై కాంగ్రెస్ నేత‌ల్లో గుబులు ప‌ట్టుకుంది. ఇక్క‌డ మ‌రోవిష‌యం ఏమిటంటే.. జ‌హీరాబాద్ ప‌క్క‌నే ఉన్న నారాయణఖేడ్‌ ఉప ఎన్నికల్లోనూ హ‌రీశ్ ఇదే వ్యూహాన్నిఅనుస‌రించి, విజ‌యం సాధించారు. ఇప్పుడు జహీరాబాద్‌లోను అలాంటి వ్యూహాన్నే అమలుచేస్తున్నారు.

మంత్రి హ‌రీశ్‌రావు తర్వాత ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ప‌ర్య‌టించారు. ఈ ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గంలో గీతారెడ్డిని ఎదుర్కోగల నాయకుడు గులాబీ పార్టీలో లేక‌పోవ‌డంతో ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను తీసుకొచ్చే ప‌నిలో కేసీఆర్ ఉన్న‌ట్లు తెలిసింది. మ‌రి కాంగ్రెస్‌లో ఫైర్‌బ్రాండ్ లేడీల‌లో ఒక‌రు అయిన గీతారెడ్డిని కంచుకోట‌లో ఎర్రోళ్ల ఎంత వ‌ర‌కు ఢీకొడ‌తారో ? చూడాలి. జ‌హీరాబాద్‌లో మంత్రి హ‌రీశ్‌రావు మంత్రం పారుతుందో లేదో చూడాలిమ‌రి.