టీఆర్ఎస్ లో హరీష్ హవా తగ్గడంలేదా ..? అదే వారిద్దరి బాధ     2018-09-24   09:34:08  IST  Sai M

టీఆర్ఎస్ పార్టీలో ఒక పధకం ప్రకారం హారీష్ రావు ను కేసీఆర్ దూరం పెడుతున్నారని వార్తలు గత కొంతకాలంగా వస్తూనే ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఆయన హవాను తగ్గిస్తూ కేసీఆర్ అనేక చర్యలు కూడా తీసుకున్నారు. కేవలం ఆయన్ను ఒక జిల్లాకు పరిమితం అయ్యేలా బాధ్యతలు అప్పగించాడు. అంతే కాదు మొన్న ప్రకటించిన పార్టీ అభ్యర్థుల లిస్ట్ లో హరీష్ రావు వర్గం లేకుండా కెసిఆర్ జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే ఇదంతా హారీష్ మీద కోపంతో కాదని.. తన కుమారుడు కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుకు ఏ వివిధమైన ఆతంకమ్ లేకుండా చేసుకునేందుకే కేసీఆర్ ఈ విధంగా చేస్తున్నాడనే వార్తలు తెలంగాణాలో వినిపిస్తున్నాయి.

తెలంగాణలో ఉద్యమ సమయం నుంచీ టీఆర్ఎస్ లో నంబర్ టు గా పేరొందిన హరీశ్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ తో తీవ్రంగా విభేదిస్తున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. క్యాడర్ నుంచి లీడర్ వరకూ అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు హరీశ్. కేసీఆర్ పరోక్షంలో గతంలో ఆయనే చక్రం తిప్పేవారు. ట్రబుల్ షూటర్ గా, పొలిటికల్ ఫైటర్ గా పేరుంది. అనేక సంక్షోభ సమయాల్లో ఆయననే రంగంలోకి దించేవారు. కానీ ఆ ప్రాధాన్యత ప్రస్తుతం కోల్పోయారు. ఈ విషయంపై పార్టీలో కూడా లోలోపల నాయకులు రగిలిపోతున్నారు. హరీష్ చేసిన తప్పేంటి కష్టకాలం నుంచి పార్టీ కోసం హరీష్ రావు కష్టపడడమేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మొదటి నుంచి టీఆర్ఎస్ లో హరీష్ కష్టపడుతూనే వచ్చాడు. తన మామ కేసీఆర్ కనుసన్నల్లో నడుస్తూ పార్టీలోనూ.. ప్రజల్లోనూ , నాయకుల్లోనూ మంచి పేరు తెచ్చికున్నాడు. అయితే.. ఈ మధ్యకాలంలో కేటీఆర్ ను అన్ని మార్గాల్లోనూ అధినేత ప్రమోట్ చేస్తున్నప్పటికీ ఇంకా పార్టీ శ్రేణుల్లో హరీశ్ కు ఆదరణ తగ్గలేదు. ద్వితీయశ్రేణి నాయకత్వం భయం కొద్దీ కేటీఆర్ కు జై జైలు కొడుతున్నప్పటికీ హరీష్ మీద ఉన్న అభిమానం తగ్గడంలేదు. అయినప్పటికీ ఆయనకు ఎన్నికల తర్వాత కీలక బాధ్యతలు అప్పగించాలని అధినేత నిర్ణయించినట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. కేసీఆర్ జాతీయ పాత్రలోకి మారితే పార్టీ పగ్గాలు, ముఖ్యమంత్రి పీఠం కుమారుడికే కట్టబెడతారని ప్రచారం సాగుతోంది.

'Harish Rao is being sidelined in TRS'-Elections 2019,Elections In Telangana,Harish Rao,KCR,KCR Wants To Down Harish Rao Intention In TRS,TRS

అయితే తాజాగా మాజీలుగా మారిన ఎమ్మెల్యేల్లో 30 మంది వరకూ హరీశ్ రావుకు సన్నిహితులున్నారు. జిల్లాలలో ఉన్న నియోజకవర్గ నేతలు, మండల స్థాయి నేతల్లో వేలాదిమంది అభిమానులున్నారు. వీరెవరికీ కేటీఆర్ నాయకత్వ సామర్థ్యంపై నమ్మకం లేదు. కేసీఆర్ తిరుగులేని నేత. ఆయన తర్వాత పార్టీని నడపగల సమర్థుడు హరీశ్ అనేది వారి విశ్వాసం. పార్టీతో అనుబంధం ఉన్న హరీశ్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు పదవి, కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తే బాగుంటుందనే సూచనలు వచ్చాయి. అయినప్పటికీ గడచిన రెండేళ్లుగా ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వకుండా మెదక్ జిల్లాకే హరీశ్ ను పరిమితం చేశారు. అంతచేసినా క్యాడర్ లో ఆయనకు ఆదరణ తగ్గలేదు. ఈ పరిణామం కూడా కేసీఆర్, కేటీఆర్ ను ఇంకా భయపెడుతూనే ఉంది.