ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ కరోనా వైరస్ ని అడ్డు పెట్టుకొని కొంతమంది కేటుగాళ్లు చేసేటటువంటి పనులు చూస్తుంటే హృదయ విదారకం కలగక మానదు.
తాజాగా ఓ ఘనుడు పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవడం ఇష్టం లేక తనకు కరోనా సోకిందని చెప్పి పెళ్లి జరిగే ముందు రోజు ఇంటి నుంచి పరారైన ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలోని కొత్తచెరువు మండలానికి చెందిన రామ్ కుమార్ అనే ఓ యువకుడికి ఇటీవలే ఇదే మండలానికి చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది.
అయితే రామ్ కుమార్ కి పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవడం ఇష్టం లేదు.దీంతో ఎలాగైనా ఈ వివాహం నుంచి బయట పడాలని పన్నాగం పన్నాడు. ఇందులో భాగంగా తనకు కరోనా వైరస్ సోకిందని అందువల్ల తాను ఇంటి నుంచి వెళ్లి పోతున్నట్లు తన మిత్రుల చేత తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేయించి నాటకం ఆడాడు.
దీంతో రామ్ కుమార్ కుటుంబ సభ్యులు కొంతమేర ఆందోళన చెందారు.
అనంతరం వధువు కుటుంబ సభ్యులు ఏమైందో ఆరా తీసేందుకు స్థానికంగా ఉన్నటువంటి అధికారులను సంప్రదించగా అసలు నిజం బయటపడింది.ఈ మధ్య కాలంలో రామ్ కుమార్ అనే వ్యక్తిని క్వారంటైన్ కి తరలించ లేదని స్పష్టం చేశారు.
ఈ విషయం విన్నటువంటి వధువు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఖంగు తిన్నారు. అంతేకాక పెళ్లి పీటలు వరకు వచ్చి పెళ్లి ఆగిపోయిందని తెలిస్తే తమ కుటుంబ పరువు మర్యాదలకి భంగం కలుగుతుందని కాబట్టి తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు.