నేను-తెలుగుదేశం’’ పుస్తకావిష్కరణలో గవర్నర్ బండారు దత్తాత్రేయ

ప్రజాస్వామ్య విలువలు, నైతిక విలువల పరిరక్షణే రాజకీయ నాయకుల కర్తవ్యంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.హైదరాబాద్ దసపల్లా లో సోమవారం సాయంత్రం జరిగిన నేను-తెలుగుదేశం’పుస్తకావిష్కరణలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

 Governor Bandaru Dattatreya At The Book Launch Of Nanu-telugudesam ,nanu-telugud-TeluguStop.com

రాజకీయాలు సేవాభావంతో ఉంటాయి తప్ప, వ్యాపారం కాదని, ప్రజలే దేవుళ్లు- సమాజమే దేవాలయంగా ఎన్టీఆర్ చెప్పారని ప్రస్తావించారు.అవినీతిని చీల్చి చెండాడిన నాయకుడు ఎన్టీ రామారావు అంటూ, రాష్ట్ర రాజకీయాల్లో సమూల మార్పులు తెచ్చిన ఘనత ఎన్టీఆర్ దే అన్నారు.ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తామిచ్చిన ప్రతి వినతికి తక్షణమే చర్యలు తీసుకుని ఫలితం చూపించేవారని తెలిపారు.1983లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భాజపా ప్రధాన కార్యదర్శిగా ఉన్న తాను అపాయింట్ మెంట్ అడిగితే ఉదయం 5గంకు సమయం ఇచ్చారని, ఒక సెకను కూడా ఆలస్యం లేకుండా ఆప్యాయంగా మాట్లాడిన విషయం గుర్తుచేసుకున్నారు.చిన్నవయసులో ప్రధాన కార్యదర్శి ఎలా అయ్యారని ఎన్టీఆర్ అడగగా, ఆర్ ఎస్ ఎస్ లో పనిచేసిన అంశాన్ని తెలియజేశానని అన్నారు.వాజ్ పేయి ప్రధానిగా, బాలయోగి లోక్ సభ స్పీకర్ గా ఉన్నప్పుడు కంభంపాటితో తనకు పరిచయం ఏర్పడిందంటూ, వెరీ గుడ్ కమ్యూనికేటర్ అని, నిబద్ధతతో పనిచేసే వ్యక్తని ప్రశంసించారు.

2014 ఎన్నికల ముందు, ఎన్డీఏ 2 ఏర్పాటులో ప్రధాని నరేంద్రమోదితో మాట్లాడి మళ్లీ సయోధ్య కుదిర్చిన వ్యక్తి కంభంపాటిగా గుర్తుచేశారు.అధికారం ఉన్నా, పోయినా, అదే ఆప్యాయతతో తాము ఉన్నామని అన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, విభజన తర్వాత రెండు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వపరంగా తోడ్పాటు ఇచ్చామన్నారు.ఒక మిషన్ గా తీసుకుని రాజకీయాల్లో పని చేసే వ్యక్తులు అరుదంటూ అలాంటివారిలో కంభంపాటి రామమోహన రావు ఒకరని’’ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.

చంద్రబాబు ప్రసంగం:

ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ‘‘రాజకీయాల్లోకి వచ్చి గణనీయమైన మార్పులు తేవడం, స్వచ్ఛంద సంస్థ పెట్టి ప్రజాసేవ చేయడం అనే ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల మధ్య చర్చ పెట్టినప్పుడు తాను మొదటిదానినే సూచించానని గుర్తుచేశారు.టిడిపి చేపట్టిన సంక్షేమ పథకాలు దేశానికే దిశానిర్దేశం అయ్యాయంటూ, ఎన్టీఆర్ రూ 2కిలో బియ్యం ఈ రోజు ఆహారభద్రతకు దారితీసిందని, మహిళలకు ఆస్తిహక్కు కల్పించినప్పడు అది దేశవ్యాప్తంగా అమలవుతోందని, దేశానికే టిడిపి దిశానిర్దేశం చేసిందని అన్నారు.

నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ల ద్వారా దేశ రాజకీయాలనే సమూలంగా మార్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని తెలిపారు.తానెప్పుడూ ప్రజాహితం కోసమే తప్ప, అధికారం కోసం ఆరాట పడలేదని అన్నారు.

నేను చేసిన అభివృద్ధే తనకు ఆత్మతృప్తి, ఎంతో సంతృప్తి ఇచ్చిందని అన్నారు.అప్పుడు ఐటి అంటే రాజశేఖర రెడ్డితో సహా పలువురు అప్పట్లో ఎగతాళి చేసిన విషయం ప్రస్తావించి, ఇప్పుడా ఐటి రంగం, ఆనాడు నెలకొల్పిన ఇంజనీరింగ్ విద్యార్ధులే ఇప్పుడు విదేశాల్లో నిలదొక్కుకుని దేశానికే సంపద సృష్టించేందుకు కీలకం అయ్యాయని గుర్తుచేశారు.

మళ్లీ తెలుగుదేశం పార్టీ తెలుగుజాతికి పునరంకితం అవుతుందని, తెలుగువారి అభివృధ్ది కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని, దీనికి అందరి సహకారం ఉండాలని కోరారు.

Telugu Chandra Babu, Cpi Yana, Governor, Nanu Desam, Tdp-Political

కంభంపాటి రామమోహన్ చిత్తశుద్ది కల కార్యకర్త అంటూ, ‘‘ఒకే పార్టీ-ఒకే జెండా’అని కంభంపాటి గర్వంగా చెప్పగలగడం అందరికీ స్ఫూర్తిదాయకంగా పేర్కొన్నారు.చేపట్టిన ప్రతిపదవికి కంభంపాటి గుర్తింపు తెచ్చారని కొనియాడారు.స్వలాభం కోసం ఏనాడూ ఆయన ఆరాట పడలేదని అంటూ, అటు వ్యాపారం ద్వారా కుటుంబ పోషణతోపాటు పదిమందికి ఉపాధి కల్పిస్తూ, ఇటు రాజకీయాల్లో పూర్తి సమయం వెచ్చించడం కంభంపాటి అంకితభావమని అన్నారు.

ఏ పని చెప్పినా సిన్సియర్ గా చేయడం కంభంపాటి సుగుణం అన్నారు.ఎన్టీఆర్ మరియు తన పర్యటనల షెడ్యూల్ తయారీతోపాటు, వాటిని తూచతప్పకుండా అమలయ్యేలా చూడటం కత్తిమీద సాముగా పేర్కొంటూ, ఆ పర్యటనల విజయవంతం చేయడం వెనుక కంభంపాటి కష్టం ఉందని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు చమత్కారాలు: సిద్ధాంతం కోసం పనిచేసేది సిపిఐ నారాయణ అయితే, ప్రజల మేలు కోసం పనిచేసేది తెలుగుదేశం పార్టీ అంటూ చంద్రబాబు చమత్కరించారు.నేను-తెలుగుదేశం పుస్తకం పేరు చాలా బాగుందంటూ, సిపిఐ నారాయణ, శ్రీనివాస రెడ్డి లాంటి వ్యక్తులు కూడా తమ అనుభవాలతో ‘‘నేను-తెలుగుదేశం’’ పుస్తకం రాయవచ్చని చతురోక్తి విసిరారు.తననెప్పుడూ విమర్శించే పాత్రికేయుడు శ్రీనివాస రెడ్డి ఇప్పుడు తనను అర్ధం చేసుకున్నారంటూ ఆయన ప్రసంగంలో చంద్రబాబు అతిగొప్ప ప్రజాస్వామ్యవాదిగా కొనియాడటాన్ని గుర్తుచేస్తూ చంద్రబాబు చమత్కరించారు.

ఇతర వక్తల ప్రసంగాలు:

మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ, ‘‘ఈ రోజు ప్రభుత్వంలో ఉండవచ్చు, లేకపోవచ్చు, ప్రతిపక్షంలో ఉండవచ్చు లేకపోవచ్చు.కానీ ఏ పక్షంలో ఉన్నా తనకంటూ ఒక ధర్మం ఉంటుందని, ఆ ధర్మాన్ని విస్మరించరాదని అన్నారు.రాజకీయం చిన్నవిషయం కాదంటూ, సమాజానికి, ప్రజలకు సేవచేసే అవకాశం దీనివల్లే అధికం అన్నారు.

దేవుడు మనకీ జీవితం ఇచ్చినందుకు, దానిని సార్ధకం చేసుకోవడమే మనిషి కర్తవ్యంగా తెలిపారు.రాజకీయాల్లో అవకాశాలు రావడం సహజమేనంటూ వాటిని సద్వినియోగం చేసుకోవడంలోనే మన సత్తా ఆధారపడి వుంటుందంటూ, కంభంపాటి తనకు దక్కిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని అన్నారు.

చాలామందికి తెలుగుదేశం పార్టీ అవకాశాలు ఇచ్చిందంటూ, దేశాల్లో ఫాస్టెస్ట్ ఏవియేషన్ గా భారతదేశాన్ని తీసుకెళ్లే అవకాశం కూడా తనకు పార్టీయే ఇచ్చిందని అన్నారు.తనకొక్కడికే పార్టీ అవకాశాలు ఇవ్వలేదంటూ అనేకమందికి ఇచ్చిందని, వాటిని సద్వినియోగం చేసుకోవడమే నాయకత్వ లక్షణం అన్నారు.

భావితరాలకు తెలుగుదనాన్ని నిత్యనూతనంగా అందించడమే ఎన్టీఆర్ కు మనం అందించే నిజమైన నివాళిగా’’ అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు.ఏపి శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, ‘‘ తెలుగుదేశం పార్టీలో ఉంటూనే, అటు రాజకీయంగా ఇటు వ్యాపార రంగంలో ఎదిగిన వ్యక్తి కంభంపాటిగా పేర్కొన్నారు.

నేషనల్ పార్టీలతో లైజెనింగ్ చేయడం అంటే చిన్నవిషయం కాదంటూ, ఆవిధంగానే తమందరికన్నా ఎంతో ఎత్తుకు కంభంపాటి ఎదిగారని అన్నారు.అన్ని జాతీయ పార్టీలతో తెలుగుదేశం పార్టీకి సయోధ్య కుదిర్చి, ఎన్టీఆర్, చంద్రబాబుల హయాంలో టిడిపి ప్రధాన భూమిక పోషించడం వెనుక కంభంపాటి కృషి ప్రశంసనీయంగా పేర్కొన్నారు.

అధినాయకుడి ఆలోచనలను, పార్టీ ఆశయాలను జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్ళారని అభినందించారు.

సీనియర్ పాత్రికేయులు కె రామచంద్రమూర్తి మాట్లాడుతూ, 40ఏళ్లు ఒకే పార్టీలో ఉండటం, అనేకమందితో 4దశాబ్దాలు స్నేహంగా ఉండటం, ఎన్నో ఇగోలతో ఉండే ఢిల్లీ నాయకులను ఏకం చేయడం కంభంపాటికే సాధ్యమైందని అన్నారు.

విపి సింగ్ ను ప్రధానిగా చేయడం వెనుక ఎన్టీఆర్, దేవెగౌడ, గుజ్రాల్ లను ప్రధానులుగా చేయడంలో చంద్రబాబు పాత్ర కీలకంగా పేర్కొన్నారు.లైజెనింగ్ లో కంభంపాటి మార్క్ సాటిలేనిదని అన్నారు.

సినీ దర్శకులు రాఘవేంద్రరావు మాట్లాడుతూ, ‘‘ తాను ఇవాళ ఈ స్థాయిలో ఉండటానికే కారణం ఎన్టీఆరే నంటూ, అడివి రాముడైనా అయోధ్య రాముడైనా ఎన్టీఆరే అన్నారు.రామచంద్రులుగా ఎన్టీఆర్, చంద్రబాబు తెలుగుదేశ రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.

‘‘చంద్రబాబు స్టార్ట్ అంటే తామంతా యాక్షన్ లోకి వెళ్తామని’’ అన్నారు.అనేక పదవులిచ్చి తననెంతో పార్టీ ప్రోత్సహించిందని గుర్తుచేసుకున్నారు.

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, 40ఏళ్ల రాజకీయం తమకెన్నో గొప్ప అనుభూతులను ఇచ్చిందంటూ ఎన్టీఆర్ తో తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.ఎమ్మెల్యేగా పోటీ చేస్తావా అని అడిగినప్పుడు ఎన్నికలు వచ్చేటప్పటికి 25ఏళ్లు నిండుతాయని చెప్పగా భుజం తట్టి ఫొటో తీసుకుని, ఆ ఫొటో పెట్టుకుని ఇంటింటికి వెళ్లు ఓట్లవే పడతాయని అన్న విషయం గుర్తుచేశారు.25సంవత్సరాల 3నెలలకు ఎమ్మెల్యేను చేసి తనకు రాజకీయ భిక్ష ఎన్టీఆర్ పెట్టారని అన్నారు.అతి పిన్న వయస్కుడిని తానైతే అత్యధిక వయస్కుడు ఏలూరు ఎమ్మెల్యే డాక్టర్ రంగారావుగా గుర్తు చేశారు.

గుడిసె పేదవాడి సంక్షేమం, నాగలి రైతు సంక్షేమం, చక్రం కార్మికుడి సంక్షేమంగా మూడే ముక్కల్లో తన మేనిఫెస్టో చెప్పారని, ఇప్పుడేమో పేజీలకు పేజీలు వేస్తున్నారని అన్నారు.మంత్రిగా కేబినెట్ లో ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాలు చూస్తే ఆశ్చర్యం కలిగేదని అన్నారు.

తినడానికి తిండి, కట్టుకోడానికి బట్ట, ఉండటానికి ఇల్లు మూడే మాటల్లో పేదల సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు.మునసబు, కరణాలను టచ్ చేస్తే పునాదులు కదిలిపోతాయనే భయపడే రోజుల్లో ఒకే ఒక సంతకంతో పటేల్ పట్వారీ వ్యవస్థనే రద్దు చేశారని, ప్రజలంతా పండగ చేసుకున్నారని అన్నారు.6సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపిగా, 5సార్లు మంత్రిగా పనిచేసే అవకాశం తనకు ఎన్టీఆర్, చంద్రబాబుల వల్లే దక్కిందని అన్నారు.ఎన్టీ రామారావు సిద్దాంతాలు, టిడిపి మూల సూత్రాలను యువతలోకి తీసుకెళ్లేందుకు రాఘవేంద్రరావు లాంటి వ్యక్తులు ముందుకు రావాలని అన్నారు.

రాబోయే ఎన్నికల్లో యువతకే సీట్లిచ్చి తెలుగుదేశం పార్టీని మరో 40, 50ఏళ్లు నిలబెట్టాలని చంద్రబాబుకు సూచించారు.

సీనియర్ పాత్రికేయులు శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, గ్రామాల్లో వేళ్లూనుకు పోయిన ఒక వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించిన వ్యక్తి ఎన్టీఆర్.

ఒక తరానికి రాజకీయాలు నేర్పాడు, పదవులిచ్చి ప్రజాసేవకు ప్రోత్సహించాడని అన్నారు.చరిత్ర ఎవరూ మార్చలేరని అన్నారు.

చంద్రబాబు గొప్ప ప్రజాస్వామ్యవాదిగా పేర్కొన్నారు.రాజకీయాల్లో విమర్శలు సహజమంటూ అభివృద్ధి చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.

ఐటి అంటే ఏమిటో తెలియని రోజుల్లో ఐటి యాక్సిస్ ఉన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్ర సృష్టించారని అన్నారు.పార్టీ కార్యక్రమాలు అన్నింటిలో చురుగ్గా పాల్గొంటూ, పైకి కనిపించని వ్యక్తి కంభంపాటి రామమోహన రావుగా పేర్కొన్నారు.

విద్యార్ధుల ఉత్తీర్ణతా ధ్రువపత్రాల్లో తండ్రి పేరుతో పాటు తల్లిపేరు కూడా ఈ రోజు లిఖించబడటం వెనుక రాజ్యసభ సభ్యునిగా కంభంపాటి రామమోహన రావు చొరవ, కృషే కారణంగా తెలిపారు.

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ, ‘‘ తనలాంటి సామాన్యులకు రాజకీయ అవకాశాలిచ్చిన కలియుగ దైవం ఎన్టీఆర్ గా కొనియాడారు.

ఎన్టీఆర్ లేని రాష్ట్ర రాజకీయాలను ఊహించలేమని అన్నారు.అవకాశాలు ఇచ్చింది ఎన్టీఆర్ అయితే ప్రోత్సహించింది చంద్రబాబే అన్నారు.నీతిగా, నిర్భీతిగా, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ పరిపాలన మరువలేమని అన్నారు.ఎంపి సీటు విషయంలో కృష్ణా జిల్లాలో ఇద్దరి మధ్య ఎవరికివ్వాలని డైలమా పడ్డప్పుడు తాను కంభంపాటికి ఇవ్వాలని కోరిన విషయం గుర్తుచేసి, దానివల్లే రామమోహన్ రావు జాతీయ రాజకీయాల్లో రాణించారని, మరో వ్యక్తి దేశంలోనే అత్యున్నత పదవికి ఎంపికయ్యారని, ఈ ఇద్దరి ఎదుగుదల వెనుక చంద్రబాబు నిర్ణయమే కీలకం అయ్యిందని అన్నారు.

తెలుగుజాతి ఉన్నంతకాలం, ఈ నేల ఉన్నంతకాలం ఎన్టీఆర్ ను మరువలేమని అన్నారు.

సిపిఐ నారాయణ మాట్లాడుతూ, ‘‘ రాజకీయాల్లో అడ్రస్ మారని వ్యక్తి కంభంపాటి రామమోహన్ రావుగా ప్రశంసించారు.

ఉదయం ఒకపార్టీ, సాయంత్రం మరో పార్టీలో ఉంటున్న ప్రస్తుత నాయకుల మధ్య, 40ఏళ్లు ఒకే పార్టీలో కొనసాగడం విశేషంగా పేర్కొన్నారు.విద్యార్ధి దశనుంచి చంద్రబాబు తనకు తెలుసంటూ ఆయనపై కొందరు చేస్తున్న విమర్శలకు విలువ లేదని అన్నారు.

జగన్ కు, చంద్రబాబుకు సామ్యం లేదన్నారు.ఒకమిత్రుడితో సంభాషణలో చంద్రబాబు దుర్మార్గుడని అతడనగా, తాను నిర్ద్వంద్వంగా ఖండించానని అన్నారు.చంద్రబాబుకు నువ్వు 100మార్కులిస్తే, తాను 150మార్కులిస్తానని చెప్పానన్న విషయం గుర్తుచేశారు.1983కు ముందు రాష్ట్రంలో వామపక్ష ఉద్యమం ఎన్టీఆర్ రాజకీయాల్లో రావడం వామపక్షాలకు ఇబ్బంది కల్గించిందని అన్నారు.ఫెడరల్ స్ఫూర్తికి ఎన్టీఆర్ ఆద్యుడిగా అంటూ, ఆయన వచ్చాకే కేంద్ర, రాష్ట్ర సంబంధాలకు ఒక నిర్వచనం వచ్చిందని, అధికార పంపిణీపై కొంత స్పష్టత వచ్చిందని అన్నారు.ఇప్పుడు మళ్లీ ఆ ఫెడరల్ వ్యవస్థకు ప్రమాదం వచ్చిందని అన్నారు.

మాజీ ఎంపి మురళీమోహన్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్, చంద్రబాబు సహా తమలాంటి సినీనటుల పర్యటనల షెడ్యూల్ సజావుగా సాగేలా కృషి చేసిన ఘనత కంభంపాటిదే అన్నారు.కృషి, పట్టుదల ఉంటే మనిషికి సాధ్యం కానిది, ఏదీ లేదనడానికి కంభంపాటి రామమోహన రావు నిదర్శనంగా పేర్కొన్నారు.

పార్టీ అధికారంలో ఉందాలేదా, తనకు పదవిఉందా లేదా అని కంభంపాటి ఏనాడూ చూడలేదని అన్నారు.పార్టీ బాగుంటే తనతో సహా నాయకులు, కార్యకర్తలంతా బాగుంటారని భావించేవారని ప్రశంసించారు.

రావుల చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ, దేశానికి సంక్షేమం అనేది నేర్పిందని ఎన్టీఆరే అన్నారు.నెలకు రూ 30 పింఛన్ ఇచ్చి వృద్దుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చిన ఘనత ఎన్టీఆరే దే అన్నారు.

చంద్రబాబు వేసిన బీజం వల్లే ఇవాళ హైదరాబాద్ లో ఐటి రంగం ఇంత పురోగమించిందని అన్నారు.వచ్చే తరం కోసం ఆలోచించే నాయకుడు చంద్రబాబుగా పేర్కొంటూ, స్టేట్స్ మన్ కు చంద్రబాబు మారుపేరు అన్నారు.

జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబం వైపు కేంద్రప్రభుత్వ దృష్టిని తెచ్చిన ఘనత కంభంపాటిదే అన్నారు.స్నేహానికి మారుపేరుగా కంభంపాటిని ప్రశంసించారు.

నోరుమంచిదైతే ఊరు మంచిదవుతుందనడానికి కంభంపాటి నిదర్శనం అన్నారు.ఏపి హవుసింగ్ బోర్డు ఛైర్మన్ గా తన నియామకంతో పాటు ఏపి పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ గా కంభంపాటి పనిచేశారని, తర్వాత రాజ్యసభ సభ్యులుగా కలసి పని చేశామని అన్నారు.

చాలామంది పార్టీలో పదవులు అనుభవించారని విమర్శలను ప్రస్తావిస్తూ, తెలుగుదేశంలో అనుభవించేదేమీ ఉండదని, ప్రజల కోసం పని చేయడమేనని అన్నారు.

ఏపి పీఏసి ఛైర్మన్ పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, ఈ పుస్తకం చదివిన ప్రతి ఒక్కరూ ‘‘నేను-తెలుగుదేశం’’ అనేలా ఉందన్నారు.

ఎవరికి వారికి తమ ప్రయాణం గుర్తుకొస్తుందని అన్నారు.పార్టీపై పుస్తకం రాయడం సాహసం అంటూ, భవిష్యత్తులో కంభంపాటి మళ్లీ ‘‘నేను-తెలుగుదేశం తన 80ఏళ్ల ప్రస్థానం’’ పుస్తకం రాయాలని ఆకాంక్షించారు.

కష్టపడటమే చంద్రబాబుకు తెలుసని ప్రస్తుత రాజకీయాలు నాకేంటనే స్వలాభంతో ఉంటే, చంద్రబాబు రాజకీయం మాత్రం సమాజానికేంటని ఉంటుందన్నారు.తెలుగుదేశం 40ఏళ్ల ప్రస్థానం వెనుక ఎన్టీఆర్ పార్టీ పెట్టిన ముహూర్త బలం ఎంత బలమైనదో, చంద్రబాబు నాయకత్వ సామర్ధ్యం అంత బలమైనదని అన్నారు.

ఎవరేం చెప్పినా ఆలకించడం, వారి సమస్య పరిష్కరించడం చంద్రబాబే రాజకీయంగా పేర్కొన్నారు.మాజీ ఎంపి, పుస్తక రూపశిల్పి కంభంపాటి రామమోహన రావు మాట్లాడుతూ, ‘‘ చాలా తక్కువ మందికే ఈ అద్భుత అవకాశం ఉంటుందంటూ, ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ 3తరాలతో కలిసి పనిచేసే అవకాశం లభించడం తనకు గర్వకారణంగా పేర్కొన్నారు.

ఆ అనుభవాలను భావితరాలకు అందించేందుకే ‘‘నేను-తెలుగుదేశం’’ పుస్తకాన్ని తెచ్చామని అన్నారు.మార్చి 29 1982నుంచి ఈ రోజు వరకు పార్టీతో తన అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు.రాజ్యసభ సభ్యునిగా, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రాష్ట్రాభివృద్ధికి, ప్రజా ప్రయోజనార్ధం చేపట్టిన పనులను వివరించారు.రాజకీయాలు తమకు తెలియదంటా పార్టీ అధ్యక్షుడు ఏది చెబితే అది తూచా తప్పకుండా చేయడమే తనకు తెలుసంటూ అప్పుడు, ఇఫ్పుడు, ఎప్పుడూ పార్టీ విధేయతే తన నైజంగా పేర్కొన్నారు.

సంక్షేమ రాజ్యానికి ఆద్యుడు ఎన్టీఆర్, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబుగా పేర్కొన్నారు.‘‘ఒకే పార్టీ – ఒకే జెండా’’ సిద్ధాంతంతో 40ఏళ్లుగా పనిచేయడం ఎనలేని సంతృప్తి ఇచ్చిందన్నారు.

ఇప్పుడున్న యువతరానికి తెలుగుదేశం మూలసిద్ధాంతాలను తెలియజేసేందుకే ఈ పుస్తకం తెచ్చాం అన్నారు.రెండు తెలుగురాష్ట్రాలలో యువతను మరింత ఉత్సాహంతో ప్రోత్సహించాలని సూచించారు.రాజకీయాలు సంపాదన కోసం కాదు, ప్రజా సేవ కోసమని చెప్పిన ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తాను ఆటోమొబైల్ రంగంలో ప్రవేశించి పదిమందికి ఉపాధి కల్పిస్తూ అటు వ్యాపారంలో, రాజకీయాల్లో రాణించగలిగానని అన్నారు.తన ఎదుగుదల వెనుక వెన్నెముక తెలుగుదేశం పార్టీయే అన్నారు.

ఎన్టీఆర్, చంద్రబాబుల ప్రోత్సాహంతోనే జాతీయ రాజకీయాల్లో టిడిపి కీలక పాత్ర పోషించేలా తనవంతు కృషి చేశానని’’ కంభంపాటి రామమోహన రావు అన్నారు.

టిడిపి జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, తిరునగరి జ్యోత్స్న, కుటుంబరావు, సాయిబాబు, సినీ నిర్మాత అశ్వనీదత్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సి నర్సింహారావు, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన టిడిపి నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందిస్తున్న రమణ, సాయిబాబులకు ఈ పుస్తకం తొలి ప్రతులను అందజేశారు.

రాష్ట్రపతి కోవింద్, ప్రధాని నరేంద్రమోది, మాజీ ప్రధానులు ఎబి వాజ్ పేయి, విపి సింగ్, దేవె గౌడ, గుజ్రాల్ నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, యూపిఎన్ ఏ, ఎన్డీఏ 1, ఎన్డీఎ 2 లలో ఎన్టీఆర్ మరియు చంద్రబాబులతో, వివిధ జాతీయ పార్టీ నాయకులు ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కాన్ క్లేవ్ లపై కంభంపాటి రామమోహన రావు దృశ్యమాలిక హైలెట్ గా నిలిచింది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube