తండ్రిని హరికృష్ణ 30 లక్షల అప్పు అడిగితే...ఎన్టీఆర్ గారి సమాధానం ఇది.! అసలు అంత డబ్బు ఎందుకంటే.?     2018-09-27   08:02:09  IST  Sainath G

నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో గతించి నెల కావస్తోంది. ఆయన మరణం నందమూరి కుటుంబంలో పెను విషాదాన్ని మిగిల్చింది. హరికృష్ణ వ్యక్తిత్వం విలక్షణమైనది. ఆయన సహృదయుడు. సౌహృన్మిత్రుడు, శ్రమజీవి, నిర్మొహమాటి, నిర్భయుడు, నిగర్వి… కానీ ఆవేశపరుడు. డ్రైవింగ్ మీద అమిత ఆసక్తి కలవాడు. ఆయన మంత్రిగా ఉన్నా, పార్లమెంటు సభ్యునిగా ఉన్నా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నా, ఏమాత్రం గర్వం కానీ, అహంకారం కానీ లేకుండా అందరితో కలిసి, మెలిసి తిరిగిన సలక్షణుడు, నిరాడంబరుడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద ప్రత్యేక బాధ్యతల అధికారిగా పనిచేసిన గోటేటి రామచంద్రరావు… హరికృష్ణ మరణం అనంతరం ఆయన గురించి గుర్తు చేసుకుంటూ ఓ పత్రికకు వ్యాసం రాశారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Goteti Ramachandra Rao About Harikrishna-

హరికృష్ణ గారు తండ్రిని 30 లక్షల రూపాయల అప్పు అడిగారట. అదేంటి తండ్రిని కొడుకు అప్పు అడగడం ఏంటి అనుకుంటున్నారా.? అసలు కథ ఏంటో చూడండి. ఆహ్వానం హోటల్ నిర్మాణంలో ఉన్న సమయంలో రామారావుగారు ఏకాంతంగా ఉన్నప్పుడు హరికృష్ణ వచ్చి, హోటల్ మూడవ అంతస్తు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి 30లక్షల రూపాయల అప్పు కావాలని రామారావుని సరదాగా అడిగారు. దానికి రామారావు అంతే సరదాగా స్పందిస్తూ, నన్ను (రామ చంద్రరావు) పిలిచి, ‘హరికి 30లక్షల రూపాయలు కావాలట, నా దగ్గర అంత డబ్బు ఎక్కడుందీ…, మీదగ్గర ఉంటే మీరే హరికి ఇవ్వండి’ అని పెద్దగా నవ్వేశారు. వాస్తవానికి ఆహ్వానం హోటల్‌ను అన్ని హంగులతో రామారావు నిర్మించారు.

ఓసారి రామారావు కొత్త కారు కొనాలనుకున్నారు. బెంజి కంపెనీ డీలర్ ఓ మోడల్ తీసుకొచ్చి చూపించి ధర చెప్పారు. ‘అమ్మో ఆరు లక్షల 50 వేల రూపాయలా’ అని రామారావుగారు అనగానే, మొన్న హరికృష్ణ కూడా ఈ కారును తీసుకున్నారని డీలర్ చెప్పారు. దీనికి రామారావుగారు స్పందిస్తూ ‘ఆయనకేం కొంటాడండీ, ఎందుకంటే ఆయన ఎన్టీఆర్ కొడుకు, నేను మామూలు నందమూరి లక్ష్మయ్య చౌదరి కొడుకుని. నాకు, ఆయనకూ పోలికేంటి’ అని నవ్వేశారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.