కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడంతో సామాన్య ప్రజలు ఏవి కొనాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించి కొనాల్సిన పరిస్థితి నెలకొంది.
పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో వాహనదారులు ఇతర ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు.అయితే సామాన్యులకు గ్యాస్ కంపెనీలు తాజాగా మరో భారీ ఝలక్ ఇచ్చాయి.
రాయితీ గ్యాస్ సిలిండర్లపై ఏకంగా 50 రూపాయలు పెంచాయి.సామన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలపై గ్యాస్ సిలిండర్ ధరల పెంపు రూపంలో మరో పిడుగు పడింది.ఇప్పటివరకు గ్యాస్ సిలిండర్ రూ.646.50 పైసలకు లభించగా ఇకపై గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయాలంటే రూ.696.50 పైసలు చెల్లించాలి.హైదరాబాద్ లో ప్రస్తుతం ఈ ధరలు అమలవుతుండగా ప్రాంతాలను బట్టి గ్యాస్ సిలిండర్ ధరలలో స్వల్ప మార్పులు ఉంటాయి.

పెరిగిన ధరలు తక్షణమే అమలవుతాయని గ్యాస్ కంపెనీలు చెప్పడంతో నేటి నుంచే ఈ పెంపు అమలులోకి వస్తోంది.అయితే ధరల పెంపు గురించి సామాన్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.కేంద్రం దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు ప్రజలపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.కరోనా విపత్కర పరిస్థితుల్లో సామాన్యులపై భారం పెరిగేలా నిర్ణయాలు కేంద్రం అమలులోకి రాకుండా చూడాలని అభిప్రాయపడుతున్నారు.
సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలలో మార్పులు జరుగుతాయి.అయితే నిన్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలలో మార్పులు ఉన్నట్టు ప్రకటించలేదు.
అయితే ఈరోజు మాత్రం సామాన్యులపై భారం పడేలా నిర్ణయాలను ప్రకటించాయి.మరోవైపు వంటనూనె, కంది బేడలు, బియ్యం లాంటి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతుండటం సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.