టీడీపీకి 'గంటా' తంటాలు ! పవన్ చుట్టూ అనుచరులు..?       2018-05-20   21:57:38  IST  Bhanu C

రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఏ విధంగా ఉంటారో చెప్పలేము. అసలు రాజకీయం అంటేనే ఊసరవెల్లి లా అవకాశాలను బట్టి రంగులు మార్చేయడమే. ప్రస్తుత రాజకీయాల్లో దాదాపు అందరూ ఇదే విధంగా ఆలోచిస్తూ గోడమీద పిల్లి వాటం ప్రదర్శిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ఇదే కోవలో ఇప్పుడు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా కనిపిస్తున్నారు. ఆయన చాలా కాలంగా టీడీపీలో ఉన్నా లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు. త్వరలో ఆయన వైసీపీలో చేరబోతున్నారని పుకార్లు కుడా బలంగా వినిపిస్తున్నాయి ఈ దశలో ఆయన ముఖ్య అనుచరులు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చుట్టూ కనిపించడం టీడీపీ నేతలకు మింగుడు పడడంలేదు.

ఇటీవల విశాఖ వచ్చిన పవన్ కళ్యాణ్ చుటూ ఘంటా ముఖ్య అనుచరులు కొంతమంది కనిపించారని టీడీపీ అనుమానిస్తోంది. చాలామంది ఎమ్మెల్యేలు తమకు టచ్‌లో ఉన్నారంటూ జనసేన ప్రచారం చేస్తుండగా.. ఇప్పుడు మంత్రి గంటా అనుచరులు జనసేన కార్యక్రమాలకు హాజరవ్వడం చర్చనీయాంశమైంది. తొలి నుంచి చిరంజీవి కుటుంబంతో గంటాకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ చనువుతోనే ఆయన జనసేనకు అనుకూలంగా ఉన్నట్టు గుసగుసలు మొదలయ్యాయి.

ఉత్తరాంధ్ర బస్సు పర్యటనకు సిద్దమైన పవన్‌ కల్యాణ్.. బుధవారం నుంచి విశాఖలోనే ఉన్నారు. యాత్ర ఏర్పాట్లపై శ్రేణులతో చర్చించారు. అయితే ఈ చర్చలకు.. సమావేశాలకు గంటా శ్రీనివాసరావు ముఖ్య అనుచరులు కూడా పదేపదే హాజరయ్యారు. పవన్‌ బస చేసిన హోటల్‌కు వెళ్లి ఏర్పాట్లను గంటా అనుచరులు పర్యవేక్షించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ఆమోదం లేకుండా ఆయన ముఖ్య అనుచరులు పవన్‌ కల్యాణ్‌ను ఎలా కలుస్తారని టీడీపీలోని మరో వర్గం నేతలు ప్రశ్నిస్తున్నారు.

టీడీపీపై పవన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నా.. ఘంటా మాత్రం ఏమి స్పందించడం లేదు. ఒకదశలో పవన్‌ కల్యాణ్‌కు కౌంటర్ ఇవ్వాల్సిందిగా చంద్రబాబు ఆదేశించినా… ఆయన మాత్రం సైలెంట్ గానే ఉన్నాడట. పవన్‌ కల్యాణ్ విషయంలో గంటా శ్రీనివాసరావు ఎందుకు సానుకూలంగా ఉన్నారన్న దానిపైన టీడీపీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే గంటా మాత్రం పార్టీ మారడం ఖాయం అయినా జనసేన , వైసీపీ ఏది బెటర్ అనే లెక్కలు వేసుకుంటున్నాడు.