వైసీపీలోకి గల్లా ఫ్యామిలీ ..? జగన్ ను కృష్ణ పొగడడం వెనుక రీజన్ ఇదే !       2018-06-03   01:48:48  IST  Bhanu C

ఏపీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా .. నియోజకవర్గం అయిన చంద్రగిరి లో టీడీపీకి ఎప్పుడూ ఎదురుగాలే వీస్తుంటుంది. ఏపీ అంతా పట్టుసాధిస్తున్న చంద్రబాబు ఈ నియోజకవర్గం లో మాత్రం ఆ పనిచేలేకపోతున్నాడు.అందుకే ఇరవై ఏళ్లుగా ఇక్కడ టీడీపీ జెండా ఎగరడమే లేదు. చిత్తూరు జిల్లాలోనే సీనియర్ రాజకీయ నాయకురాలిగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న గల్లా అరుణకుమారి మరోసారి పోటీలో దిగేందుకు ప్రణాళికలు సిద్థం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసి గత ఎన్నికల్లో టీడీపీలో చేరిన గల్లా ఇదే నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీలో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ తన కొడుకు గుంటూరు ఎంపిగా టీడీపీలో ఉండడంతో ఆమె పార్టీని వీడలేకపోయారు. అయితే మళ్ళీ చంద్రగిరి సీటు తనకు ఇస్తారో లేదో అన్న సందేహంలో ఆమె ఉన్నారు.

ఇదే అదునుగా భావించిన వైసీపీ గల్లా కుటుంబాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వైసిపిలో చేరితే ఆమెకు టిక్కెట్టు ఇస్తామన్న సంకేతాలు రావడంతో ఆ వైపుగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. తనతో పాటు తన కుమారుడు గల్లా జయదేవ్ కూడా వైసిపిలో చేరే అవకాశం కనిపిస్తోంది. దీనికి తాజాగా సూపర్ స్టార్ కృష్ణ చేసిన జగన్ మోహన్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పడం దీనికి సంకేతమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు..

గల్లా కుటుంబం ఇప్పుడు వైసిపిలో చేరబోతున్నారన్నది జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. రాబోయే ఎన్నికల్లో సీటే లక్ష్యంగా తన కొడుకుతో పాటు కలిసి వైసిపి తీర్థం పుచ్చుకోవడం కోసం గల్లా అరుణకుమారి ఆ పార్టీ నాయకులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తిరుపతికి చెందిన సీనియర్ వైసిపి నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డితో ఈమేరకు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

గల్లా అరుణకుమారి వైసిపిలో చేరితే తన రైట్ హ్యాండ్‌గా భావించే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జగన్ పక్కన పెట్టబోతున్నారా.. చెవిరెడ్డిని కాదని గల్లా అరుణకుమారికి చంద్రగిరి సీటు ఇస్తారా అన్నది సందేహమే. ఒకవేళ సీనియర్ నాయకురాలు కాబట్టి గల్లా అరుణకుమారికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినా తన కొడుకుకు ఎంపి టిక్కెట్టును సర్దుబాటు చేయడంలో కూడా అనేక ఇబ్బందులు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిమీదే ఇప్పుడు వైసీపీలో బాగా కసరత్తు జరుగుతుందట. అన్ని సర్దుబాటు అయితే గల్లా కుటుంబం వైసీపీ తీర్థం పుచ్చుకోవడం తొందర్లోనే ఉండబోతోంది. ఇది టీడీపీకి కొంచెం ఇబ్బందికర పరిణామమే.