251 రూపాయల ఫ్రీడం స్మార్ట్ ఫోన్ సంగతి ఏమైంది ?     2016-12-30   21:45:30  IST  Raghu V

ఫ్రీడం స్మార్ట్ ఫోన్ గుర్తుందా? రింగింగ్ బెల్స్ అనే సంస్థ 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్ అనేసరికి అంతా ఎగబడి బుకింగ్ చేసుకున్నారు. గుర్తు ఉండే ఉంటుంది కదా. ఎలా మర్చిపోతారు .. ఏకంగా ఏడు కోట్ల మంది ఈ మొబైల్ కోసం తమ పేరుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. చాలామంది ముందే డబ్బును పే చేసేసారు కూడా. ఇప్పుడు ఆ కంపెనీకి ఓ పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

రింగింగ్ బెల్స్ సంస్థ వ్యవస్థాపకుడు, ఆ సంస్థ ఎండీ మోహిత్ గోయల్ కంపెనీ బాధ్యతలు నుంచి తప్పుకున్నాడు. తన సోదరుడు, సహ వ్యవస్థాపకుడు అన్మోల్ గోయల్ తో విభేదాల వలనే మొహిత్ ఈ కంపెనీ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. మోహిత్ తో పాటు, అతని భార్య, రింగింగ్ బెల్స్ సీఈవో ధారణ గోయల్ కూడా రాజీనామా చేసింది.

మరి మొబైల్ ని బుక్ చేసుకున్న వారి పరిస్థితి ఏంటి ? కంపెనీ మూతపడిపోనుందా? పెట్టిన డబ్బు తిరిగిరాదా? కంగారు పడకండి. అలాంటి ప్రమాదమేమి లేదని అన్మోల్ గోయల్ ప్రకటించారు. ఇప్పటికే 70,000 మొబైల్స్ డెలివరి చేసారట. సంస్థ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయని, కాబట్టి ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.