కాపుల్లో ఫైటింగ్‌: కాపులు వ‌ర్సెస్ బ‌లిజ‌     2016-12-28   04:21:33  IST  Bhanu C

గ‌త కొన్నాళ్లుగా ఏపీలో అధికార టీడీపీకి కంట్లో న‌లుసుగా ప‌రిణ‌మించిన కాపు ఉద్య‌మం.. ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం హెచ్చ‌రిక‌లు ఇప్పుడు డైల్యూట్ అవుతున్నాయా? ఉద్య‌మ బ‌లం త‌గ్గిపోతోందా? కాపు నేత‌ల్లో చీలిక‌లు వ‌స్తున్నాయా? ముఖ్యంగా ముద్ర‌గ‌డ నాయ‌క‌త్వాన్ని వ్య‌తిరేకించే గ‌ళం ఏదైనా బ‌య‌లు దేరిందా? మాకు మేమే-మీకు మీరే అనే కొత్త దారుల్లో కాపులు ఉత్త‌ర ద‌క్షిణ ధ్రువాలుగా మార‌నున్నారా? అంటే.. తాజా ప‌రిణామాలు ఔన‌నే స‌మాధాన‌మే ఇస్తున్నాయి. విష‌యంలోకి వెళిపోతే.. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో కాపుల‌ను బీసీ జాబితాలో చేర్చుతానంటూ టీడీపీ అధినేత హోదాలో చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఈ క్ర‌మంలో ఆయ‌న 2014లో అధికారం చేప‌ట్టాక‌.. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడికి చెందిన మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఇదే విష‌యంపై చంద్ర‌బాబును నిల‌దీయడం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే పెద్ద ఎత్తున ఆందోళ‌న జ‌ర‌గ‌డం, ర‌త్నాచ‌ల్ ఎక్స్‌ప్రెస్‌ని త‌గ‌ల బెట్ట‌డం జ‌రిగాయి. దీంతో చంద్ర‌బాబు హుటాహుటిన జ‌స్టిస్ మంజునాథ‌తో ఓ క‌మిటీని ఏర్పాటు చేశారు. ఆ త‌ర్వాత కూడా రిజ‌ర్వేష‌న్ల‌పై ఎలాంటి ముందడుగూ ప‌డ‌లేదు. దీంతో ఎప్ప‌టికప్పుడు ముద్ర‌గ‌డ ప్ర‌భుత్వానికి హెచ్చ‌రిక‌లు చేస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న రాష్ట్ర వ్యాప్తంగా కాపుల ఆక‌లి కేక- నినాదంతో నిర‌స‌న కూడా వ్య‌క్తం చేశారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు ఈ ఉద్య‌మంలో చీలిక‌లు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి ఏపీలోని కాపులంద‌రూ ఒక్క‌టే. అయితే, ప్రాంతాల‌ను బ‌ట్టి వారి పేర్లు మారిపోతుంటాయి. సీమ ప్రాంతాల్లో బ‌లిజ‌గా పేర్కొంటారు. రాష్ట్రంలో కాపుల‌తో పోల్చుకుంటే వీరి సంఖ్య ఎక్కువ‌గా ఉంది. వీరు కూడా కాపుల‌తో క‌లిసి ప్ర‌భుత్వంపై పోరు చేస్తున్నారు. అయితే, ఇంత‌లో ఏమైందో ఏమో.. ముద్ర‌గ‌డ నాయ‌క‌త్వంలో తాము ఉద్య‌మించేది లేద‌ని వారు వెల్ల‌డించి అంద‌రినీ షాక్‌కు గురి చేశారు. దీనికిగాను వాళ్లు చెబుతున్న రీజ‌న్లు ఒకింత ఆస‌క్తిగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

కాపువ‌ర్గంలో బ‌లిజ‌ల సంఖ్యే ఎక్కువ‌గా ఉంద‌ని, అయినా కూడా త‌మ‌కు ఎలాంటి ప్రాధాన్యం లేద‌ని, మా క‌న్నా కాపుల‌కే ప్రాధాన్యం ఉంద‌ని బ‌లిజ నేత‌లు వాపోతున్నారు. నిజానికి ఉద్యమంలో తమ పాత్రను పరిమితం చేసి సంఖ్యాప‌రంగా ఎక్కువ‌గా ఉన్న తమను చూపించి కాపు నేతలు లబ్ధి పొందుతున్నార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో బ‌లిజ‌ల‌కు ఎలాంటి ప్ర‌యోజ‌న‌మూ ఉండడం లేద‌ని వాపోతున్నారు. ఈ నేప‌థ్యంలో గ‌ళం విప్పిన బలిజ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ ప‌రోక్షంగా ముద్ర‌గ‌డ నాయ‌క‌త్వాన్ని ఒప్పుకునేది లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. అంతేకాదు, బ‌లిజ‌లను ముద్ర‌గ‌డ వాడుకునే వ‌దిలే టైపులో ఉన్నార‌ని ఆయ‌న ఆరోపించారు.

‘మాకు కాపులతో కలిసి ఉద్యమించినందున వచ్చే లాభమేమీ లేదు. మేం బ్రిటీషుకాలం నుంచే బీసీల్లో ఉన్నాం. ఇంకా వారికే ఆ సౌకర్యం లేదు. మూడు జిల్లాల్లో ఉన్నవాళ్లే ఉద్యమిస్తుండగా లేనిది 6 జిల్లాల్లో బలంగా ఉన్న మేమెందుకు సొంతంగా ఉద్యమించకూడదు? అందుకే మేం దీనిపై జిల్లాల్లో పర్యటించి బలిజల్లో చైతన్యం తెస్తాం. బలిజలు చాలామంది ఇంకా కాపు నాయకత్వంపై భ్రమల్లో ఉన్నారు. మాకు 5 జిల్లాల్లో ఇప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యం లేకపోయినా ఏ ఒక్క కాపు నేత కూడా మాట్లాడలేదు. ఇకపై కాపులు వేరు బలిజలు వేరు. ఎవరి ఉద్యమాలు వారివి’ అని వెల్లడించ‌డం నిజంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. మ‌రి రాబోయే రోజుల్లో ప‌రిణామాలు ఎలా మ‌లుపు తిరుగుతాయో చూడాలి.