వైసీపీనే బెటర్ ! తాజా మాజీల చూపు ఆ పార్టీ వైపే !       2018-07-09   22:06:04  IST  Bhanu C

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు నేతలంతా ఒక్కొక్కరిగా అడుగులు వేస్తున్నారు. గతంలో ఇతర పార్టీల్లో ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం రాజకీయ మనుగడ కోసం ఎదురు చూస్తున్న వారు, అధికార పార్టీలో తమకు అన్యాయం జరుగుతోందని భావించి పార్టీ మారుదామని చూస్తున్నవారికి, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నవారికి ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యామ్న్యాయంగా కనిపిస్తోంది. వీరే కాకుండా ప్రస్త్తుతం టీడీపీలో కొనసాగుతున్న నాయకులు కూడా జగన్ పార్టీలోకి క్యూ కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఇప్పటికే వైసీపీలోకి వెళ్లేందుకు నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు.. టీడీపీ ఎమ్యెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలోకి చేరే ప్రయత్నంలో ఉన్నాడు. మరోవైపు మానుకోట మహిధర్ రెడ్డి తను వైఎస్సార్సీపీలోకి చేరుతున్న విషయాన్ని స్పష్టంగా ప్రకటించాడు. కేవలం ఈ మాజీ మంత్రులు మాత్రమే కాదు.. మరింత మంది రాజకీయ ఉనికి కోసం ఆరాట పడుతున్న నేతలు కూడా త్వరలోనే వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక వైపు జగన్ చేపడుతున్న పాదయాత్ర కూడా ఆ పార్టీకి మంచి జోష్ తీసుకువస్తోంది. ఇదే విషయాన్ని తూర్పు గోదావరి జిల్లా రుజువు చేస్తోంది.

ఈ నేపథ్యంలో … రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా అధికారం చేజిక్కించుకునేందుకు అధికార పార్టీ టీడీపీ పావులు కదుపుతోంది. అంతే కాదు కొత్తగా పుట్టుకొచ్చిన జనసేన కూడా అన్ని స్థానాల్లో పోటీ చేసి అధికార పీఠాన్ని దక్కించుకోవాలనే ఆశలో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పటికీ ఇతర పార్టీల్లోంచి నేతలు వస్తామంటే ఆహ్వానం పలుకుతోంది. ఇక జనసేన పరిస్థితి కూడా ఇంతే. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను చేర్చుకుంటే కానీ ఆ పార్టీకి అభ్యర్థులు దొరికే పరిస్థితి కనిపించడంలేదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో తాజా మాజీ నాయకులంతా వైసీపీ వైపు చూడడం రాజకీయ సంచలనం కలిగిస్తోంది.