వైసీపీలోకి ముగ్గురు మాజీ మంత్రులు   EX Ministers To Join YCP     2017-01-02   23:00:30  IST  Bhanu C

ఏపీలో అధికార టీడీపీ నిన్న‌టి వ‌ర‌కు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పేరుతో విప‌క్ష వైసీపీ ఎమ్మెల్యేల‌ను వ‌రుస‌పెట్టి త‌న పార్టీలో చేర్చేసుకుంది. ఈ వ‌ల‌స‌ల జోరుకు ఇంకా బ్రేకులు ప‌డలేదు. రీసెంట్‌గా కృష్ణా జిల్లా పామ‌ర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి క‌ల్ప‌న‌సైతం వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిపోయారు. ఇక ఇదే జాబితాలో అదే జిల్లాకు చెందిన నూజివీడు ఎమ్మెల్యే ప్ర‌తాప్ అప్పారావు, తిరువూరు ఎమ్మెల్యే ర‌క్ష‌ణ‌నిధి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే టీడీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు ధీటుగా వైసీపీ కొద్ది రోజులుగా ఆప‌రేష‌న్ రిక‌వ‌రీ పేరుతో ఇత‌ర పార్టీల నేత‌ల‌తో పాటు కొంద‌రు మాజీ ఎమ్మెల్యేల‌ను త‌న పార్టీలో చేర్చుకునే ప్ర‌య‌త్నంలో స‌క్సెస్ అవుతోంది. ఈ క్ర‌మంలోనే వైసీపీ అధినేత జ‌గ‌న్ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చేప‌ట్టిన ఆప‌రేష‌న్ రిక‌వ‌రీలో కొంత‌మంది ప్ర‌ముఖులు ఆ పార్టీలో జాయిన్ అయ్యారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు వైసీపీకి మ‌రో ఉత్తేజం లాంటి వార్త ఏపీ పాలిటిక్స్‌లో వినిపిస్తోంది. టీడీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉన్న ఒకే జిల్లా నుంచి ముగ్గురు మాజీ మంత్రులు వైసీపీలో చేరుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. వారిలో ఇద్ద‌రు కేంద్ర మాజీ మంత్రులు కావ‌డం విశేషం. టీడీపీ అధికారంలోకి వ‌చ్చేందుకు ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఎంతో కీ రోల్ ప్లే చేసింది. గ‌త ఎన్నిక‌ల్లో ఈ జిల్లాలో ఉన్న 15 ఎమ్మెల్యే, 3 ఎంపీ స్థానాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసేసింది.

ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు కోసం ఇక్క‌డ టీడీపీ హ‌వాకు బ్రేకులేసే ప‌నిలో ఉన్న జ‌గ‌న్ ఈ జిల్లాలో ముగ్గురు మాజీ మంత్రుల‌ను త‌న పార్టీలో చేర్చుకుని వారికి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. మాజీ కేంద్ర‌మంత్రి, ప్ర‌ముఖ సినీన‌టుడు కృష్ణంరాజుకు న‌ర‌సాపురం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌లు, మ‌రో మాజీ కేంద్ర మంత్రి కావూరు సాంబ‌శివ‌రావుకు ఏలూరు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని జ‌గ‌న్ యోచ‌న‌గా ఉంద‌ట‌.

ఇక జ‌గ‌న్ తండ్రి వైఎస్‌కు అత్యంత స‌న్నిహితుడు అయిన మాజీ మంత్రి వ‌ట్టి వ‌సంత్‌కుమార్ చూపులు సైతం వైసీపీ వైపే ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన వైసీపీ నేతలతకు టచ్ లో ఉన్నారని మంచి ముహూర్తం చూసుకుని పార్టీలో చేరతారని తెలుస్తోంది. వ‌సంత్‌కు ఆయ‌న గ‌తంలో ప్రాథినిత్యం వ‌హించిన ఉంగుటూరు టిక్కెట్టు ఇస్తార‌ని స‌మాచారం. ఏదేమైనా టీడీపీ కంచుకోట‌ను కూల్చేందుకు జ‌గ‌న్ పెద్ద ప్లాన్‌తోనే రెడీ అవుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. మ‌రి ఈ ప్ర‌య‌త్నాలు ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతాయో చూడాలి.