వైకాపాకు పెరుగుతున్న జోష్‌     2017-01-15   03:57:27  IST  Bhanu C

ఏపీలో ఏకైక విప‌క్షం జ‌గ‌న్ నేతృత్వంలోని వైకాపాలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉన్న నిరాశాపూరిత వాతావ‌ర‌ణం తొలిగిపోయి.. కొత్త‌జోష్ వ‌చ్చింద‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. దీనికి కార‌ణంగా ఏంట‌ని అడిగితే.. త‌మ పార్టీలోకి కొత్త నేత‌లు చేరుతున్నార‌ని, సీఎం చంద్ర‌బాబు అండ్‌కోలు చెబుతున్న‌ట్టు ఓ ఎల్ ఎక్స్‌లో పెట్టి అమ్ముకోవాల్సిన అవ‌స‌రం త‌మ పార్టీకి ఏమీ లేద‌ని అంటున్నారు. వాస్త‌వానికి నిన్న మొన్న‌టి వ‌ర‌కు వైకాపా నుంచి నేత‌లు క్యూక‌ట్టి మ‌రీ అధికార టీడీపీ పంచ‌న చేరిపోయారు. జ‌గ‌న్ ప‌క్షానే ఉంటామ‌ని ప్ర‌తిజ్ఞ చేసిన ఎమ్మెల్యే ఉప్పులేటి క‌ల్ప‌న సైతం ముహూర్తం చూసుకుని సైకిలెక్కేశారు.

దీంతో అంతా వైకాపా ప‌ని అయిపోయింద‌ని అనుకున్నారు. ఓ అడుగు ముందుకేసిన టీడీపీ నేత ప‌య్యావుల కేశ‌వ్‌.. జ‌గ‌న్ త‌న పార్టీని పాత సామాన్లు అమ్ముకునే ఓ ఎల్ ఎక్స్‌లో పెట్టు అమ్ముకోవాల‌ని కామెంట్ చేశాడు. అయితే, అనూహ్యంగా వైకాపాలోకి కూడా ఇత‌ర పార్టీల నుంచి నేత‌లు క్యూ క‌డుతున్నారు. ఈ ప‌రిస్థితే ఇప్పుడు వైకాపా నేత‌ల్లో జోష్ పెంచుతోంది. నెల క్రితం గుంటూరుకు చెందిన కీల‌క నేత, కాంగ్రెస్‌లో తిరుగు లేని నేత‌గా ఎదిగిన కాసు బ్ర‌హ్మానంద రెడ్డి మ‌న‌వ‌డు, కృష్ణారెడ్డి కుమారుడు మ‌హేష్ రెడ్డి వైకాపా తీర్థం పుచ్చ‌కున్నాడు. ఇది వైకాపాలో ఊపు తెచ్చింది.

ఈ క్ర‌మంలో ఇప్పుడు మ‌రో నేత కుమారుడు కూడా వైకాపాలో చేరేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నాడు. మాజీమంత్రి కోటగిరి విద్యాధరరావు కుమారుడు శ్రీధర్‌.. వైకాపాలో చేరేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలో ఆదివారం ఆయ‌న త‌న అనుచ‌రుల‌తో జ‌గ‌న్‌ను క‌లిశారు. వైకాపాలో చేరేందుకు త‌న అభీష్టాన్ని జ‌గ‌న్‌కి చెప్పాడు. దీంతో జ‌గ‌న్ ఆయ‌న‌ను ఆహ్వానించేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. ఈ నెల 28న పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో జరిగే బహిరంగ సభలో శ్రీధ‌ర్‌ అధికారికంగా జ‌గ‌న్ పార్టీలో చేరతారని తెలిసింది. ఇదిలావుంటే, ఇటీవ‌ల బీజేపీ నుంచి వ‌చ్చి వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు కూడా జ‌గ‌న్ చెంత‌న చేరిపోయారు. దీంతో ఇప్పుడు వైకాపాలో జోష్ క‌నిపిస్తోంది.