జ‌న‌సేన‌లోకి మాజీ ముఖ్య‌మంత్రి     2017-01-05   04:19:45  IST  Bhanu C

`ఇప్ప‌టికే పెళ్లి కుదిరింది. పెళ్లి కూతురు ఎవ‌రనేది మాత్రం ప్ర‌స్తుతానికి ర‌హ‌స్యం. త్వ‌ర‌లోనే తాళిబొట్టు క‌ట్టే ముహూర్తం తేల‌గానే అంద‌రికీ చెబుతాను. శుభ‌లేఖ‌లు అంద‌రికీ ఇస్తా` అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు మాజీ సీఎం న‌ల్లారి కిర‌ణ్‌కుమార్ రెడ్డి. అయితే ఇప్పుడు ఆ ముహూర్తం రానే వ‌చ్చిందా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. తొంద‌ర‌లోనే అయ‌న జ‌న‌సేన పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.

స‌మైక్యాంధ్ర చివ‌రి సీఎం న‌ల్లారి కిర‌ణ్‌కుమార్ రెడ్డి ప్రస్తుతం రాజ‌కీయ నిరుద్యోగిగా మారిపోయారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి – సొంతపార్టీ స్థాపించి తీవ్రంగా దెబ్బతిన్న కిరణ్ రాష్ట్రవిభజన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నాలుగైదు పార్టీలున్నా ఎందులో చేరాలో ఇంకా తేల్చుకోలేక స‌త‌మ‌త‌మైపోతున్నారు. విభజన తరువాత రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం మానేసిన కిరణ్ ఇటీవలి కాలంలోనే ఆయన మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వాల‌ని నిర్ణయించుకున్నారు.

తొలుత ఆయ‌న బీజేపీలో చేర‌తానే ప్ర‌చారం జోరుగా జ‌రిగింది. అయితే బీజేపీకి ఏపీలో స‌రైన పునాదులు లేవు. దీంతో ఆ నిర్ణ‌యం విర‌మించుకున్నారు. ఇక కాంగ్రెస్‌లోకి వెళ్దామ‌న్నా.. విభ‌జ‌నతో దెబ్బ‌తిన్న కాంగ్రెస్‌కి మ‌రో ఐదేళ్ల వ‌ర‌కూ ఫ్యూచ‌ర్ లేదు. ఇక వైసీపీలోకి వెళ్లినా సొంతంగా ప‌నిచేయ‌లేరు. ఆ పార్టీలో అన్నీ జ‌గ‌నే క‌నుక.. అందులో ఇమ‌డ‌లేమ‌ని నిర్ణ‌యించుకున్నారు. జ‌గ‌న్ లాంటి వ్య‌క్తి కింద కిర‌ణ్ ఏ హోదాలో ప‌ని చేస్తార‌న్న డౌట్ కూడా ఆయ‌న‌కు ఉన్న‌ట్లుంది.

ఇక మిగిలింది జ‌న‌సేన‌. అందులోకి వెళితే పార్టీ నిర్మాణంలో కీల‌కంగా మార‌వ‌చ్చు, ఇదే స‌మ‌యంలో త‌న‌కు త‌గిన గుర్తింపు కూడా ద‌క్క‌వ‌చ్చ‌న్న చ‌ర్చ‌లు కూడా వినిపిస్తున్నాయి. అందుకే ఆయ‌న ప‌వ‌న్‌ వైపు మొగ్గు చూపుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ మేరకు పవన్ నుంచి కూడా సానుకూలత వచ్చినట్లు టాక్. ప్ర‌స్తుతం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ప్ప‌.. పేరు మోసిన రాజ‌కీయ నాయ‌కులెవ‌రూ లేరు! కిర‌ణ్‌తో ఈ లోటు ఇప్పుడు తీరిపోనుంది. మ‌రి ఫైన‌ల్‌గా కిర‌ణ్ పొలిటిక‌ల్ రూటు ఎలా ఉంటుందో చూడాలి.