Enti Ramoji Vatini Musestunara     2017-11-06   05:18:19  IST  Raghu V

టెక్నాల‌జీ పెరుగుతున్న కొద్దీ కొన్ని కొన్ని వ‌స్తువులు పూర్తిగా మాయ‌మైపోతున్నాయి. మ‌న క‌ళ్ల‌ముందే కంప్యూట‌ర్ ల్యాప్‌టాప్‌గా, ల్యాప్‌టాప్ టాబ్లెట్‌గా, టాబ్లెట్ ఫాబ్లెట్ (స్మార్ట్ ఫోన్ ట్యాబ్లెట్ క‌లిపి)గా మారిపోయాయి. కొత్త‌రూపంలో వ‌చ్చే గాడ్జెట్స్ త‌క్కువ ప‌రిమాణంలో ఉండి ఎక్కువ ఫీచ‌ర్స్ ని ఇస్తున్నాయి. తినే తిండి, నిద్ర‌పోయే మంచం లాంటివాటిని వ‌ర్చువ‌ల్‌ రూపంలోకి మార్చ‌లేము కానీ, మ‌న జీవితంలో చాలా అంశాల‌ను టెక్నాల‌జీ, భౌతిక రూపం నుంచి సిస్ట‌మ్‌లో క‌నిపించే చిత్రాలుగా మార్చేసింది. నిత్య జీవితంలో మ‌నం వెళ్లి చేయాల్సిన ప‌నుల‌ను యాప్స్ చేసేస్తున్నాయి. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు న్యూస్ పేపర్ల మీద బాగా పడింది.

పేపర్లు చదివే వారి సంఖ్య క్రమ క్రమం గా తగ్గిపోవడంతో యాజమాన్యాలు ఆర్ధిక కష్టాల్లో కూరుకుపోతున్నాయి. ఈ బాధలన్నిటిని తట్టుకోలేక యాజమాన్యాలు కూడా వెనక్కి తగ్గిపోతున్నాయి. కొన్ని కొన్ని కనుమరుగయిపోగా మరికొన్ని మూసివేతకు దగ్గరగా ఉన్నాయి. ఇప్పుడు మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు ఓ పుస్త‌క‌మో, పేప‌రో చ‌దివేతీరిక‌, వాటికోసం క‌నీసం ఓ అర‌గంట స‌మ‌యం కేటాయించే ఓపిక కూడా ఉండ‌డం లేదు. నిత్యం జ‌రిగే మార్పుల‌ను చెవుల్లో ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకుని వార్త‌లు వినేస్తున్నారు. ఎంట‌ర్ టెయిన్ మెంట్ కోసం అర‌చేతిలో అద్భుతాల‌ను తెరిచి.. యూట్యూబ్‌లో వీక్షించేస్తున్నారు. లేదా న‌చ్చిన చానెల్‌ను చేతిలోని స్మార్ట్ ఫోన్‌లోనే చూసేస్తున్నారు. ఇక‌, వీరికి పుస్త‌కాల‌తో పనేంటి ఎప్పటికప్పుడు తాజా సమాచారం అంతా వెబ్సైట్ లో వచ్చేస్తుంది.

ఈ విధాన‌మే ప్ర‌స్తుతం ప్రింట్ మీడియాను పెద్ద ఎత్తున దెబ్బ‌తీస్తోంది. చిన్న ప‌త్రికల మాట ప‌క్క న పెడితే.. ఈనాడు వంటి అతి పెద్ద వ్య‌వ‌స్థ‌ల‌ను సైతం ఈ డిటిజ‌ల్ మీడియా విప్ల‌వం క‌దిలించేస్తోంది! దీంతో ఆయా సంస్థ‌లు ఖ‌ర్చు పెరిగినా లాభం లేక‌, న‌ష్టాల బాట‌ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే మెహ‌ర్నానీకి పోకుండా కొన్నింటి ప్ర‌చుర‌ణ‌లు నిలిపివేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. తెలుగు వెలుగే ధ్యేయంగా రామోజీ రావు ఈనాడు దిన‌ప‌త్రిక‌తో పాటు కొన్ని ప్ర‌త్యేక ప‌త్రిక‌ల‌ను తీసుకువ‌చ్చారు. తెలుగు క‌థ‌, తెలుగు న‌వ‌ల కాన్సెప్టులుగా తెచ్చిన చ‌తుర‌, విపుల వంటి వాటికి.. ఈ డిజిట‌ల్ విప్ల‌వం రాక‌ముందు ఎంతో ప్రాధాన్యం ఉండేది. కానీ ప్రస్తుతం ప్రింట్ మీడియా నుంచి విడుద‌లైన పుస్త‌కాల‌ను కొని చ‌దివేందుకు పాఠ‌కులు నిరాశ‌క్త‌త వెలిబుచ్చుతున్నారు. ఈ నేప‌థ్యంలో న‌ష్టాల బాట ప‌డుతున్న కొన్నింటిని వ‌దిలించుకోవాల‌ని రామోజీ నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనే విపుల‌, చ‌తుర‌, సితార‌ వంటి వాటి ముద్ర‌ణ‌ను నిలిపివేస్తారు. అయితే, వీటిని య‌ధాత‌థంగా ఆన్‌లైన్‌లో మాత్రం కొనసాగిస్తారని రామోజీ సన్నిహితులు చెబుతున్నారు.

Click here to Reply or Forward