వివాహం అనేది మానవ జీవితంలో ప్రత్యేకమైన వేడుక.అంతటి ప్రత్యేకమైన శుభకార్యాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు.
అయితే వివాహాలు ఎనిమిది రకాలు ఉంటాయని మీకు తెలుసా? అష్టవిధ వివాహాలు అంటే పెళ్లిళ్లు ఎనిమిది రకాలు అని చెప్పవచ్చు.అవి బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము, ఆసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము అని 8 వివాహాలు ఉన్నాయి.అయితే ఈ వివాహాలను ఎలా జరుపుకుంటారో ఇక్కడ తెలుసుకుందాం…
బ్రాహ్మము:

బ్రహ్మము వివాహం అంటే మన ఇళ్ళల్లో జరిగే వివాహాలను చెప్పవచ్చు.ఎంతో గుణవంతుడైన వరుడికి అందమైన కన్యను ఇచ్చి పెళ్లి చేయడాన్ని బ్రహ్మము అంటారు.
దైవము:
యజ్ఞంలో ఋత్విజుడుగా వచ్చిన బ్రహ్మచారికి కన్నెపిల్లను ఇచ్చి వివాహం చేయటం దైవము అని చెబుతారు.వీరికి పుట్టిన సంతానం14 తరాల వారిని పవిత్రులుగా చేస్తారు.
అర్షము:

అర్షము అనగా వరుడు నుంచి రెండు గోవులను కన్యాశుల్కంగా తీసుకుని తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేయడాన్ని అర్షము అని పిలుస్తారు.
ప్రజా పత్యము:
వధూవరులు ఒక్కటై గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించండని వధూవరులను దీవించి చేసే వివాహమే ప్రజా పత్యము.వీటికి పుట్టిన సంతానం ఆరు తరాల వారిని పవిత్రులుగా చేస్తారు.
అసురము:
వదువు ఇష్టాయిష్టాలతో పని లేకుండా వరుడు నుంచి ధనమును కన్యాశుల్కంగా తీసుకొని చేసే వివాహాన్ని అసుర వివాహం అంటారు.
గాంధర్వము:

వధూవరులు పెళ్లి వయసుకు రాగానే ఒకరినొకరు ఇష్టపడి పెద్దల అంగీకారం లేకుండా చేసుకునే వివాహాన్ని గాంధర్వ వివాహం అంటారు.పూర్వం శకుంతల, దుష్యంతుల వివాహం గాంధర్వ వివాహంగానే జరిగింది.
రాక్షసము:
వధూవరులకు ఇష్టం ఉండి పెద్దలు వీరి పెళ్లికి నిరాకరించినపుడు వరుడు తన బలంతో కన్యను తీసుకువచ్చి వివాహం చేసుకోవడాన్ని రాక్షసం అంటారు.పురాణాలలో శ్రీకృష్ణుడు రుక్మిని ఈ విధంగానే వివాహమాడాడు.
పైశాచము:
కన్యకు గాని వారి కుటుంబ సభ్యులకుగాని ఇష్టం లేకుండా బలవంతంగా ఆ కన్యను ఎత్తుకెళ్లి వివాహం చేసుకోవడాన్ని పైశాచము అంటారు.
ఈ విధంగా 8 రకాల వివాహాలలో మొదటి నాలుగు వివాహాలు బ్రాహ్మణులకు ఎంతోయోగ్యమైనవి.
గాంధర్వ, రాక్షసములు రాజులకు, వైశ్యులకు పవిత్రమైనవని చెప్పవచ్చు.