ఈయన తయారు చేస్తున్న స్పూన్లను ఎంచక్కా తినేయవచ్చు తెలుసా..? ప్లాస్టిక్ భూతంపై పర్యావరణ ప్రేమికుడి యుద్ధం..!

ప్లాస్టిక్ అనేది నిత్యం మన దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయింది.ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసే ప్లేట్లు, తాగే టీ, కాఫీ, జ్యూస్ కప్పులు, స్పూన్లు, బయట మనం తినే ఫుడ్స్ అన్నీ ప్లాస్టిక్ పాత్రల్లోనే తింటున్నాం.

 Eat With It And Then Eat It Narayana Peesapati-TeluguStop.com

లంచ్ బాక్స్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.చాలా మంది ప్లాస్టిక్‌తో తయారు చేసిన లంచ్ బాక్స్‌లను ఉపయోగిస్తున్నారు.

అలాగే బిందెలు, షాపుకు వెళ్లినప్పుడు సరుకులతో వచ్చే ప్లాస్టిక్ కవర్లు.ఇలా మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్‌ను ఉపయోగించని సందర్భం లేదు.

అయితే ప్లాస్టిక్ చాలా చవక, తక్కువ బరువు ఉంటుంది.అందుకనే దాన్ని ఉపయోగించడం ఎక్కువైంది.

కానీ దాంతో కలిగే అనర్థాల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు.ప్లాస్టిక్ మన శరీరంలోకి వెళ్లి క్యాన్సర్ వంటి ప్రాణాంతక జబ్బులను కలిగించడమే కాదు, పర్యావరణానికి కూడా హాని కలిగిస్తోంది.

మనం వాడేసిన ప్లాస్టిక్ వస్తువులు కొన్ని వేల ఏళ్లకు గానీ భూమిలో పూర్తిగా కలవడం లేదు.దీంతో అటు పర్యావరణం దెబ్బ తింటోంది.

అయితే ప్లాస్టిక్ ప్రభావాన్ని కొంత వరకైనా తగ్గించాలనే ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేస్తున్నారు.అందులో భాగంగానే మనం నిత్యం వాడే స్పూన్లు, ఫోర్క్‌లు, చాప్‌స్టిక్స్, గంటెలను ఆయన తినదగిన పదార్థాలతో చేస్తున్నారు.

ఆ ప్రయత్నం సత్ఫలితాలనే ఇస్తోంది.

ఆయన పేరు పీసపాటి నారాయణ (48).హైదరాబాద్‌లో ఉన్న ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ సెమి ఎరిడ్ ట్రాపిక్స్ (ఇక్రిశాట్)లో పరిశోధకుడిగా పనిచేశారు.అయితే నిత్యం పెరిగిపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల మన పర్యావరణానికి ఎంత హాని కలుగుతుందో ఆయన గుర్తించారు.

దీంతో ప్లాస్టిక్ ప్రభావాన్ని కొంత వరకు అయినా తగ్గించాలనే ఉద్దేశంతో ఆయన బేకీస్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 2010లో ఓ పరిశ్రమను నెలకొల్పారు.దానికి ఆయన ఎండీగా ఉండగా, అందులో ఆయన భార్య డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

ఇక ఆ పరిశ్రమలో పనిచేస్తున్నది అందరూ ఆడవారే కావడం విశేషం.

బేకీస్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ ద్వారా నారాయణ మనం నిత్యం వాడే స్పూన్లు, చాప్ స్టిక్స్, ఫోర్క్‌లను తినదగిన పదార్థాలతో తయారు చేస్తున్నారు.అందుకు గాను ఆయన జొన్న పిండి, బియ్యం పిండి, గోధుమ పిండి కలిపి ఆయా వస్తువులను తయారు చేస్తున్నారు.అంటే.

ఈ పదార్థాలతో తయారు చేసిన స్పూన్లు, చాప్ స్టిక్స్, ఫోర్క్‌లతో మనం ఆహార పదార్థాలను తిన్నాక వాటిని కూడా మనం తినేయవచ్చన్నమాట.అలా స్పూన్లు, చాప్ స్టిక్స్, ఫోర్క్‌లను కూడా మనం తినేందుకు అవకాశం ఉంటుంది.

మనం ఆహారం తినడం మొదలు పెట్టిన 10 నిమిషాల్లో అవి మెత్తగా అవుతాయి.దాంతో ఆహారం తినడం అయ్యాక వాటిని కూడా మనం ఎంచక్కా తినేయవచ్చు.

అవి నచ్చలేదనుకుంటే వాటిని నిరభ్యంతరంగా పడేయవచ్చు కూడా.కేవలం 6 రోజుల వ్యవధిలోనే మట్టిలో కలిసిపోతాయి.

దీని వల్ల పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుంది.ప్లాస్టిక్ ప్రభావం చాలా వరకు తగ్గుతుంది.

అయితే ఇలా తినదగిన స్పూన్లు, ఇతర వస్తువులను తయారు చేసే యంత్రాలను రూపొందించేందుకు నారాయణకు రూ.60 లక్షలకు పైగానే ఖర్చయింది.ఇక ఆ వస్తువులను ఆయన ప్రస్తుతం చాలా తక్కువ ధరకే అందిస్తున్నారు.మన హైదరాబాద్ నగరంలో పలు చోట్ల స్టాల్స్, ఎగ్జిబిషన్లలో వీటిని విక్రయిస్తున్నారు.ఇక విదేశాల నుంచి కూడా ఈ ఐటమ్స్‌కు ఆర్డర్లు వస్తున్నాయి.దీంతో నారాయణ త్వరలో తన పరిశ్రమను మరింత విస్తరించి మరికొంత మందికి ఉపాధి కల్పించనున్నారు.

ఇక త్వరలో ఆయన భార్యే పూర్తిగా ఆ పరిశ్రమ బాధ్యతలను నిర్వర్తించేలా చర్యలు చేపట్టనున్నారు.పర్యావరణానికి ఎంతగానో మేలు చేసే ఈ ప్రయత్నం చేస్తున్నందుకు మనం నారాయణను నిజంగా అభినందించాల్సిందే.!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube