తాగొచ్చి భార్యతో గొడవ...పసికందును నేలకేసి బాదిన కిరాతక తండ్రి.! షాకింగ్ వీడియో.!   Drunk Auto Driver Ruthlessly Beats Up 3-year-old Son     2018-07-10   23:29:16  IST  Raghu V

భార్యభర్తల గొడవకు చిన్నారి బలయ్యాడు. భార్యపై కోపాన్ని పసిగుడ్డుపై చూపించాడా భర్త. నెలల పసికందును నేలకేసి బాదాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో చోటు చేసుకుంది. ఫుల్ గా తాగొచ్చి భార్యతో గొడవపడి పసిపిల్లాడిపై ప్రతాపం చూపాడు ఆ నీచుడు. మూడేళ్ల చిన్నారికి అర్ధరాత్రి కాళరాత్రిని చూపించాడు. ఆ పసివాణ్ని తలకిందిలుగా చేసి ఆటోకేసి బాదాడు. గాల్లోకి ఎగరేశాడు. ఆ దృశ్యాలను ప్రత్యక్షంగా చూసినవారికి పై ప్రాణాలు పైనే పోయాయి. ఇంత జరిగినా బాలుడి తల్లి తన భర్తపై ఫిర్యాదు చేయడానికి ముందుకురాకపోవడం గమనార్హం.

వివరాలలోకి వెళ్తే..శివ గౌడ్, అనూష దంపతులు జగద్గిరిగుట్టలోని శ్రీనివాసనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. తరచూ మద్యం తాగే శివ.. ఏ అర్ధరాత్రికోగాని ఇంటికి చేరుకునేవాడు కాదు. ఈ విషయంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి వివాదం పెద్దది అవ్వడంతో ఇంట్లో ఉన్న నెలల చిన్నారిని ఆవేశంగా బయటకు తీసుకువచ్చాడు. అక్కడే ఉన్న ఆటోపై విసిరివేశాడు. దీంతో బాలుడి తల, పొట్ట భాగంలో గాయాలయ్యాయి. బాలుడు ఏడుస్తున్నా.. కనికరించకుండా తలకిందులుగా చేసి గాల్లోకి ఎగరేశాడు.

రాత్రి విధుల్లో భాగంగా చక్కర్లు కొడుతున్న ఇద్దరు కానిస్టేబుళ్లు శివ చేస్తున్న దాష్టికాన్ని గమనించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అతడితో పెనుగులాడి బాలుణ్ని విడిపించారు. చిన్నారిని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనను స్థానికులు మొబైల్ లో చిత్రీకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

బాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై స్థానికులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే దంపతుల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు చెబుతున్నారు.