అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా డెమొక్రాటిక్ అభ్యర్ధి కమలా హారిస్,( Kamala Harris ) రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్‌లు ( Donald Trump )హోరాహోరీగా తలపడుతున్నారు.ఇద్దరి మధ్యా ఇటీవల ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగింది.
ఇందులో కమలా హారిస్ పై చేయి సాధించినట్లుగా అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.అయితే ట్రంప్ వర్గీయులు మాత్రం డిబేట్ నిర్వహించిన ఏబీసీ న్యూస్‌పై( ABC News ) విమర్శలు చేస్తున్నారు.
ఈ క్రమంలో ట్రంప్ సన్నిహితురాలు లారా లూమర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.కమలా హారిస్‌పై జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన ఈమెపై స్వయంగా రిపబ్లికన్లు సైతం మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో లారా లూమర్‌ను( Laura Loomer ) ట్రంప్ వెనకేసుకొచ్చారు.ఆమె తనకు పెద్ద మద్ధతుదారురాలని, ఆమె ప్రచారంలో సానుకూలంగా మాట్లాడుతుందని మాజీ అధ్యక్షుడు శుక్రవారం దక్షిణ కాలిఫోర్నియాలో జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు.
ఇటీవలి రోజుల్లో లూమర్‌తో తనకున్న సన్నిహిత సంబంధాలపై మిత్రపక్షాలు ఆందోళన చేయడంపై విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానమిచ్చారు.తాను లారాను నియంత్రించనని, ఆమె ఒక స్వేచ్ఛా స్పూర్తి అన్నారు.
లారా ఒక బలమైన వ్యక్తని.ఆమెకు ధృడమైన అభిప్రాయాలు ఉన్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు.లూమర్ తన ప్రచారం కోసం పనిచేయరని, ఆమె ఒక ప్రైవేట్ వ్యక్తని.కానీ తనకు దీర్ఘకాలంగా మద్ధతుదారని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో స్పష్టం చేశారు.
రాడికల్ లెఫ్ట్ మార్క్సిస్ట్‌లు, ఫాసిస్టులు నాపై హింసాత్మకంగా దాడి చేయడం, దుమ్మెత్తిపోయడం చూసి ఆమె విసిగిపోయారని ట్రంప్ అన్నారు.
లారా లూమర్ తరచు వివాదాస్పద వ్యాఖ్యలు, పోస్ట్‌లతో వార్తల్లో నిలుస్తారు.నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో కమలా హారిస్ కనుక గెలిస్తే వైట్‌హౌస్ కరివేపాకులా ఉంటుందని వ్యాఖ్యానించారు.వైట్‌హౌస్ ప్రసంగాలు కాల్ సెంటర్ మాదిరిగా ఉంటాయని పోస్ట్ పెట్టారు.
అయితే ఆమె పోస్టులను రిపబ్లికన్ నేతలు లిండ్సే గ్రాహం, థామ్ టిల్లిస్‌లు ఖండించారు.