ఎన్నికల్లో ఓటమి: ట్రంప్ విపరీత ఆలోచనలు.. అధికారులు అడ్డుకోకపోయుంటే..!!!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం తనదేనని చివరి వరకు ఎంతో ధీమాగా కనిపించిన డొనాల్డ్ ట్రంప్‌కు అమెరికన్లు షాకిచ్చిన సంగతి తెలిసిందే.కౌంటింగ్ తొలి రోజు ఎంతో ఉత్సాహంగా కనిపించిన ఆయన.

 Trump Asked Advisers About Possible Strike On Iranian Nuclear Site, Donald Trump-TeluguStop.com

విజయోత్సవాలకు సిద్ధం కావాల్సిందిగా తన మద్ధతుదారులకు పిలుపునిచ్చారు.కానీ కొద్దిగంటల్లోనే ఫలితాలు తారుమారై జో బైడెన్ ఘన విజయం సాధించారు.

దీంతో ఎన్నికల్లో, కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వచ్చారు.అక్కడితో ఆగకుండా కోర్టుల్లో సైతం పిటిషన్లు దాఖలు చేయించారు.

న్యాయస్థానాల్లో చుక్కెదురు కావడంతో ట్రంప్ మౌనం దాల్చారు.అటు అధికార బదిలీకి, వైట్ హౌస్ ఖాళీ చేయించేందుకు ఇష్టపడకపోవడంతో ఆయన వైఖరి వివాదాస్పదం అవుతోంది.

రెండు రోజుల క్రితం ఓటమిని అంగీకరించిన ట్రంప్.సోమవారం నేనే గెలిచాను అంటూ ట్వీట్ చేశారు.

అయితే ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ఆయన విపరీత ఆలోచనలు చేస్తున్నారు.రెండు నెలలు మాత్రమే పదవిలో కొనసాగే వీలుండటంతో ఉన్న కాస్త సమయంలో ఏవేవో చేసేసి తన ప్రత్యర్ధి బైడెన్‌ను ఇరికించాలని ప్లాన్లు వేస్తున్నారు.

ఇప్పటికే బైడెన్‌కు, చైనాకు మధ్య వివాదాన్ని రాజేయడానికి ప్రయత్నించినట్లుగా వార్తలు వచ్చాయి.తాజాగా అమెరికా చిరకాల ప్రత్యర్ధి ఇరాన్‌పై దాడి చేయాలని ట్రంప్ భావించినట్లుగా తెలుస్తోంది.ఇరాన్‌లోని ప్రధాన అణుస్థావరంపై దాడి చేయడానికి ఉన్న మార్గాలను సూచించాలని ఓ ఉన్నతస్థాయి సమావేశంలో ట్రంప్‌ అధికారుల్ని కోరినట్లు సమాచారం.ఈ భేటీలో ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌, మైక్‌ పాంపియో, కొత్తగా నియమితులైన డిఫెన్స్‌ సెక్రటరీ క్రిస్టోఫర్‌ మిల్లర్‌, జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఛైర్మన్‌ జనరల్‌ మార్క్‌ మిల్లే ఉన్నట్లు సమాచారం.

దీనికి సంబంధించిన వివరాలను సదరు అధికారి ధ్రువీకరించినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది.

Telugu China, Donald Trump, Joe Biden, Kamala-Telugu NRI

అయితే, ట్రంప్‌ నిర్ణయాన్ని అధికారులు అంగీకరించలేదని సమాచారం.ఇరాన్‌పై దాడి తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని అధ్యక్షుడిని హెచ్చరించినట్లు తెలుస్తోంది.అధికారుల సూచన మేరకు ట్రంప్‌ వెనక్కి తగ్గారని సమాచారం.

అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ట్రంప్‌ ఇరాన్‌పై కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఒబామా హయాంలో ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని 2018లో రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇదేకాక ఇరాన్‌పై కఠిన వాణిజ్యపరమైన ఆంక్షలు విధించారు.ఇక ఈ ఏడాది జనవరిలో బాగ్దాద్ విమానాశ్రయం సమీపంంలో జరిగిన అమెరికన్‌ డ్రోన్‌ దాడిలో ఇరాన్‌లో శక్తివంతమైన వ్యక్తిగా అభివర్ణించే జనరల్ ఖాసీం సులేమాని మరణించారు.

ట్రంప్‌ ఆదేశం మేరకే ఈ దాడులు జరిగాయి.ఫలితంగా ఇరు దేశాల మధ్య వివాదాలు మరింత ముదిరాయి.

ఇప్పుడు తాజాగా నటాన్జ్‌లో ఉన్న ఇరాన్ ప్రధాన అణు స్థావరంపై అమెరికా దాడి చేస్తే.ఆ చర్య ప్రాంతీయ సంఘర్షణకు దారితీస్తుంది.తద్వారా కొత్తగా అధ్యక్ష స్థానంలోకి వచ్చే జో బైడెన్‌కు తీవ్రమైన విదేశాంగ విధాన సవాలుగా మారే అవకాశముందని నిపుణుల అంచనా.అందుకే ట్రంప్ ఈ ప్రమాదకర ఆలోచనకు తెరదీసారని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube