ఏపీలో బిజెపి జనసేన పార్టీ అధికారకంగా పొత్తు కొనసాగిస్తున్నాయి.కానీ ఎప్పుడూ ఆ రెండు పార్టీల మధ్య ఆ సఖ్యత ఉన్నట్టు కనిపించలేదు.
రెండు పార్టీలు విడివిడిగానే రాజకీయ కార్యక్రమాలు చేపడుతూ, విడివిడిగానే రాజకీయ అజెండాలను ప్రకటిస్తూ వస్తున్నాయి.ఉమ్మడిగా కార్యాచరణను రూపొందించి పోరాటాలు చేపట్టడం, ప్రజల్లోకి వెళ్లడం వంటివి చేపట్టకుండా, విడివిడిగానే రాజకీయ వ్యవహారాలు చేస్తూ వస్తున్నారు.
ఇదిలా ఉంటే విశాఖలో ఈనెల 11, 12 తేదీలలో ప్రధాని నరేంద్ర మోది టూర్ ఉంది.విశాఖలో రెండు రోజులపాటు ప్రధాని ఉండబోతున్నారు.
ప్రధాని పర్యటన ను హైలెట్ చేసి తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఒకవైపు ఏపీ అధికార పార్టీ వైసిపి ప్రయత్నాలు చేస్తోంది.ఈ మేరకు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి ప్రధాని టూర్ కు సంబంధించిన వ్యవహారాలను చక్కబెడుతున్నారు. అయితే ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఇప్పటి వరకు ఆహ్వానించలేదు .అసలు ఆహ్వానించే ఉద్దేశంలో ఉన్నట్టుగా కూడా కనిపించడం లేదు.వాస్తవంగా తమ మిత్రపక్షంగా ఉన్న పార్టీని తప్పకుండా బిజెపి ఆహ్వానించాలి.కానీ ఇప్పటివరకు పవన్ కు ఆహ్వానం అందకపోవడంతో పవన్ తీరుపై బీజేపీ నేతల్లో ఆగ్రహం ఉందనే విషయం తెరపైకి వచ్చింది.
ఈ మధ్య కూడా పవన్ బిజెపి అంశాన్ని ప్రస్తావిస్తూ తనకు ప్రత్యేకంగా రాజకీయ వ్యూహాలు ఉన్నాయని, తాను రోడ్డు మ్యాప్ అడిగినా బిజెపి ఇవ్వలేదని , బిజెపితో ముందుకు వెళ్లడం కష్టం అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.అయితే పవన్ సైతం బిజెపితో తెగ తెంపులు చేసుకుంటున్నట్లుగా మాత్రం చెప్పలేదు.
ఇక ప్రధాని టూర్ కు మీ మిత్రపక్షంగా ఉన్న జనసేన ను పిలుస్తున్నారా లేదా అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ను మీడియా ప్రశ్నించినా ఆయన దీనిపై స్పందించేందుకు నిరాకరించారు.అయితే పవన్ తీరుపై బీజేపీ నేతలకు అసంతృప్తి, ఆగ్రహం ఉండడానికి కారణం ఇటీవల ఇప్పటం టూర్ కు పవన్ వెళ్లారు.
ఆ సందర్భంగా వామపక్ష పార్టీలు నేతలతో పవన్ సమావేశం కావడం బిజెపి నేతలకు ఆగ్రహం కలిగించిందట.అంతకుముందు విజయవాడలో నోవాటెల్ లో టిడిపి అధినేత చంద్రబాబు పవన్ తో భేటీ కావడం ఈ సందర్భంగా రాజకీయ అంశాలు తెరపైకి రావడం , త్వరలోనే పొత్తు పెట్టుకోబోతున్నామనే సంకేతాలు ఇవ్వడం వంటివి బిజెపికి మరింత మంట పుట్టించాయట.ఆ అసంతృప్తి తో పాటు, బిజెపి ని వీడి టిడిపికి దగ్గర అయ్యేందుకే పవన్ ఎక్కువగా ప్రయత్నిస్తున్న క్రమంలో ఇప్పుడు ప్రధాని టూర్ కు పవన్ కు బిజెపి ఆహ్వానం అందించేందుకు ఆసక్తి చూపించడం లేదట.