ఈ మధ్య కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు గాను పలు కఠిన చర్యలు మరియు చట్టాలు అమలులోకి తీసుకు వచ్చినప్పటికీ మహిళలపై జరుగుతున్న ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి.తాజాగా ఓ వైద్యుడు వైద్యం కోసం వచ్చిన మహిళను బలవంతం చేస్తూ తన కోరిక తీర్చాలని బలవంత పెట్టిన ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ పరిసర ప్రాంతాల్లో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే విజయవాడ పరిసర ప్రాంతంలో ఓ దళిత మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది.ఈమె కుటుంబ పోషణ నిమిత్తమై తన భర్తతో కలిసి స్థానిక పట్టణంలో చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది.
కాగా ఇటీవలే ఈ మహిళకి కొంతమేర అస్వస్థత చేయడంతో దగ్గరలో ఉన్నటువంటి క్లినిక్ కి చికిత్స నిమిత్తం వెళ్ళింది.అయితే తన జబ్బు ఏంటో తెలుసుకుని వైద్యం చేయాల్సినటువంటి వైద్యుడు కీచకుడు గా మారి ఆమెపై బలవంతం చేయడానికి ప్రయత్నించాడు.
అంతేగాక తన లైంగిక వాంఛ తీర్చితే డబ్బు కూడా ఇస్తానని మభ్య పెట్టేందుకు యత్నించాడు.కానీ మహిళ మాత్రం అందుకు లొంగలేదు.
ఎలాగోలా ఆ కీచక వైద్యుడి నుంచి తప్పించుకున్న దళిత మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి తనపై జరిగినటువంటి అఘాయిత్యం గురించి పోలీసులకు వివరించింది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే ఆ కీచక వైద్యుడిని అదుపులోకి తీసుకొని కటకటాల్లోకి నెట్టారు.