తేజ.. నీ అంత తెలివి తక్కువోడు లేడయ్యా!       2018-04-30   03:45:55  IST  Raghu V

అప్పట్లో దర్శకుడు తేజ అంటే ఒక బ్రాండ్‌. టీనేజ్‌ లవ్‌ స్టోరీ చిత్రాలకు పెట్టింది పేరు అయిన తేజ ఎన్నో సూపర్‌ హిట్‌ ప్రేమ కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఎంతో మంది హీరోలను, హీరోయిన్స్‌ను, నటీనటులను వెండి తెరకు పరిచయం చేశాడు. అలాంటి తేజ దాదాపు దశాబ్దం కాలం పాటు సక్సెస్‌ లేక చతికిల పడ్డాడు. ఎన్నో ఫ్లాప్‌ల తర్వాత ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో సక్సెస్‌ను దక్కించుకున్నాడు. రానా, కాజల్‌ జంటగా తెరకెక్కిన ఆ సినిమా గత సంవత్సరం మంచి విజయాన్ని సొంతం చేసుకుని రానా కెరీర్‌లో మంచి కమర్షియల్‌ సక్సెస్‌గా నిలిచింది. నిర్మాతలకు కూడా మంచి లాభాలను తెచ్చి పెట్టడం జరిగింది.

ఏ దర్శకుడైనా, హీరో అయినా కూడా సక్సెస్‌ వచ్చినప్పుడు మరింత జాగ్రత్త పడి సినిమాలు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కాని తేజ మాత్రం తన తెలివి తక్కువతనంతో మంచి అవకాశాలను చేజార్చుకుని, మరికొన్నింటిని వదిలేసుకుని ఇప్పుడు నానా హైరానా పడుతున్నాడు. ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం విడుదలైన వెంటనే వెంకటేష్‌ ఈయన దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేసేందుకు ముందుకు వచ్చాడు. ఆ సినిమాకు కథ సిద్దం చేయడంతో పాటు ఆట నాదే వేట నాదే అనే టైటిల్‌ను కూడా అనుకున్నారు. వెంకీ లుక్‌ ఫైనల్‌ అయ్యింది, ఫస్ట్‌లుక్‌ కూడా బయటకు వచ్చింది. అలాంటి సమయంలో తాను ప్రతిష్టాత్మక ఎన్టీఆర్‌ చిత్రాన్ని చేస్తున్నాను అంటూ వెంకీ సినిమాను పక్కకు నెట్టేశాడు.

పూర్తిగా ఎన్టీఆర్‌ సినిమాపై దృష్టి పెట్టిన సమయంలోనే నందమూరి బాలకృష్ణ సున్నితంగా తేజను సాగనంపాడు. నీ వల్ల ఎన్టీఆర్‌ ప్రాజెక్ట్‌ సాధ్యం కాదని, నీ శక్తి అందుకు సరిపోదని, నీ క్రేజ్‌ ఈ చిత్రానికి అడ్డంకి అవుతుందని బాలకృష్ణ చెప్పడంతో గౌరవ ప్రధంగా ఉండాలనే ఉద్దేశ్యంతో తేజ స్వయంగా తాను ఎన్టీఆర్‌ చిత్రానికి న్యాయం చేయలేను అని, అందుకే తప్పుకుంటున్నట్లుగా ప్రకటించాడు. ఇప్పుడు తేజ చేతిలో సినిమానే లేదు. వచ్చిన రెండు మూడు ఆఫర్లు వద్దనుకుని ఎన్టీఆర్‌ను మాత్రమే నెత్తిన పెట్టుకున్న తేజ ఇప్పుడు పెద్ద సంకటంలో పడ్డట్లయ్యింది.

దర్శకుడు తేజతో ఆ మద్య ఒక యువ హీరో నటించేందుకు ఆసక్తి చూపించి, ఒక నిర్మాతను కూడా పంపించడం జరిగింది. కాని తేజ మాత్రం పెద్ద హీరోల మంత్రమే జపించాడు. దాంతో ఆ హీరో ప్రస్తుతం మరో సినిమాతో బిజీ అయ్యాడు. వెంకీ మల్టీస్టారర్‌ సినిమాతో బిజీ అయ్యాడు. ఈ నేపథ్యంలో తేజ ఛాన్స్‌ కోసం అని అన్నపూర్ణ స్టూడియో గడప తొక్కినట్లుగా తెలుస్తోంది. నాగార్జునకు సరిపోయే ఒక కథను తీసుకుని వెళ్లాడట. ప్రస్తుతం నాగార్జున సినిమాలు ఏమీ చేయడం లేదు. అందుకే తేజకు ఛాన్స్‌ ఇస్తాడనే నమ్మకంతో ఉన్నాడు. చేతికి వచ్చిన అవకాశాలు పోగొట్టుకుని ఇప్పుడు వెదుక్కుంటున్న తేజను తెలివి తక్కువోడు కాక మరేమనాలి మీరే చెప్పండి?