ఉదయ్‌ కిరణ్‌ బయోపిక్‌.. కాబోయే అల్లుడు!!       2018-05-17   06:22:03  IST  Raghu V

‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ను తెరకెక్కించాల్సిన దర్శకుడు తేజ ఆ సినిమా తన వల్ల కాదు అంటూ పక్కకు తప్పుకున్న విషయం తెల్సిందే. బాలకృష్ణ తన క్రియేటివిటీకి గౌరవం ఇవ్వకుండా, తనను సినిమాలో పరిమితం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకే తాను ఎన్టీఆర్‌ బయోపిక్‌ నుండి తప్పుకున్నట్లుగా సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ను వదులుకున్న తేజ తన తదుపరి సినిమాగా వెంకటేష్‌ హీరోగా చేయబోతున్నట్లుగా మొదట వార్తలు వచ్చాయి, ఆ తర్వాత నాగార్జునతో ఈయన చర్చలు జరుపుతున్నట్లుగా పుకార్లు షికార్లు చేశాయి. చివరకు ఈయన ఉదయ్‌ కిరణ్‌ సినిమా చేయబోతున్నట్లుగా ప్రచారం మొదలైంది.

మొదట ఉదయ్‌ కిరణ్‌ ఆటో బయోపిక్‌ను తేజ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చినప్పుడు ఏ ఒక్కరు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అసలు ఆయన అంతటి సాహసం చేస్తాడని తాము భావించడం లేదు అంటూ కొందరు గట్టిగానే చెబుతూ వచ్చారు. కాని అనూహ్యంగా తేజ ఆ సినిమాకు స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నట్లుగా తేలిపోయింది. దాంతో పాటు ఉదయ్‌ కిరణ్‌ సినిమాకు కాబోయే అల్లుడు అంటూ టైటిల్‌ను కూడా నిర్ణయించాడు. చిరంజీవికి అు్లడు కావాల్సిన ఉదయ్‌ కిరణ్‌ జస్ట్‌ మిస్‌ అయ్యాడు. చిరంజీవి పెద్ద అల్లుడిగా చక్రం తిప్పాల్సిన ఉదయ్‌ కిరణ్‌ ప్రస్తుతం మన మద్య లేకుండా పోయాడు.

ఉదయ్‌ కిరణ్‌ బయోపిక్‌ అనగానే ఎక్కడో కొంత ఆసక్తి రేకెత్తింది. కాని తాజాగా ‘కాబోయే అల్లుడు’ అంటూ సినిమాకు తేజ టైటిల్‌ ఫిక్స్‌ చేయడంతో అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. అంచనాలకు తగ్గట్లుగా తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడు అనే నమ్మకం వ్యక్తం అవుతుంది. అయితే ఈ సినిమాను మెగా వర్గాల వారు మరియు మెగా సన్నిహితులు ఎంత మేరకు అడ్డుకునే ప్రయత్నం చేస్తారో అంటూ సినీ వర్గాల వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ హీరోల నుండి మెగా ఫ్యాన్స్‌ వరకు అంతా కూడా దీన్ని నిలిపేసేందుకు ప్రయత్నాలు చేయడం ఖాయం.

ఇలాంటి బెదిరింపులకు తేజ బయపడే రకం కాదు. ఆయన అనుకున్నది అనుకున్నట్లుగా తెరకెక్కించేందుకు ఎంత దూరం అయినా వెళ్లేందుకు సిద్దం అవుతాడు. ఈ చిత్రం మరో నిర్మాత నిర్మిస్తే సరైన న్యాయం జరగదనే ఉద్దేశ్యంతో తానే స్వయంగా నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఏర్పాట్లు కూడా ముమ్మరం చేశాడు. కాబోయే అల్లుడు సినిమాలో అంతా కూడా కొత్త వారే కనిపిస్తారని సమాచారం అందుతుంది. కొత్త వారు కాకుండా పాత వారు ఏ ఒక్కరు కూడా ఇందులో నటించేందుకు ఆసక్తి చూపించే అవకాశం లేదు. అందుకే తేజ కొత్త వారివైపుకు మొగ్గు చూపాడు.