చాలా టైం ఉంది సూరి.. అప్పుడే ఈ తొందర ఎందుకు చెప్పు       2018-07-06   02:29:53  IST  Raghu V

రామ్‌ చరణ్‌తో ‘ధృవ’ చిత్రాన్ని తెరకెక్కించి సక్సెస్‌ను దక్కించుకున్న దర్శకుడు సురేందర్‌ రెడ్డి ప్రస్తుతం చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గత సంవత్సర కాలంగా ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటూనే ఉంది. ఈ చిత్రం కోసం దర్శకుడు సురేందర్‌ రెడ్డి చాలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. చిరంజీవి పాత్రను అద్బుతంగా చిత్రీకరించడంతో పాటు, సినిమాను భారీ ఎత్తున తెరకెక్కించేందుకు సురేందర్‌ రెడ్డి కిందా మీదా పడుతున్నాడు. ఈ సమయంలోనే ఆయన తర్వాత సినిమా గురించి మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. సూరి తర్వాత సినిమా రేసులో ఇద్దరు స్టార్‌ హీరోలు ఉన్నారు అంటూ ప్రచారం జరుగుతుంది.

చిరంజీవి సైరా చిత్రం వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంటే దాదాపుగా సంవత్సర కాలం ఉందన్నమాట. వచ్చే సంవత్సరం వేసవి తర్వాతే దర్శకుడు సురేందర్‌ రెడ్డి సినిమా ఉండే అవకాశం ఉంది. అంటే సంవత్సరం కంటే ఎక్కువ సమయం సూరి వద్ద ఉంది. అయితే ఇప్పుడే తన తదుపరి చిత్రం గురించి ఈయన ఆరాట పడుతున్నట్లుగా అనిపిస్తుంది. మొన్నటికి మొన్న అల్లు అర్జున్‌కు ఒక స్టోరీ లైన్‌ వినిపించి ఓకే చెప్పించుకున్నాడు. అల్లు అర్జున్‌తో ఈయన తర్వాత సినిమా ఉంటుందని అంతా భావించారు. ఈ సమయంలోనే ఈయన మహేష్‌బాబుతో ఒక చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

మహేష్‌బాబుతో సురేందర్‌ రెడ్డి చేసిన అతిథి చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడటం జరిగింది. అయితే ఆ చిత్రంలో మహేష్‌బాబు లుక్‌ మరియు స్టైల్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. అందుకే అప్పుడే మరో చిత్రాన్ని సూరి దర్శకత్వంలో చేయాలని మహేష్‌బాబు భావించాడు. అందుకు సంబంధించిన చర్చలు తాజాగా జరిగాయి అంటూ ప్రచారం జరుగుతుంది. వచ్చే సంవత్సరం ఆరంభంలో సురెందర్‌ రెడ్డికి డేట్లు ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం మహేష్‌బాబు తన 25వ చిత్రాన్ని చేస్తున్నాడు.

మహేష్‌ 25వ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే సమయంలో చిరంజీవి 151వ చిత్రంతో సూరి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇద్దరి చిత్రాలు ఒకే సమయంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇద్దరు కూడా ఒకేసారి ఖాళీ అవ్వనున్నారు. అందుకే వీరిద్దరి కాంబో సినిమాకు ఛాన్స్‌ ఎక్కువగా ఉందని సినీ వర్గాల వారు కూడా అనుకుంటున్నారు. అయితే సంవత్సరం తర్వాత చేయబోతున్న సినిమా గురించి ఇప్పటి నుండే చర్చ ఎందుకని, ప్రస్తుతం చేస్తున్న సినిమాను జాగ్రత్తగా చేయాల్సిందిగా మెగా ఫ్యాన్స్‌ సురెందర్‌ రెడ్డికి సలహా ఇస్తున్నారు.