బాలయ్య చేసిన తప్పే నాగ్‌ చేస్తున్నాడు       2018-05-22   23:14:19  IST  Raghu V

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు గతంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. పోకిరి, దేశముదురు, ఇడియట్‌ వంటి సినిమాలను చేసిన పూరి అదే జోరును కొనసాగించడంలో విఫలం అవుతున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఈయనకు సక్సెస్‌ అనేదే లేకుండా పోయింది. ఈయనపై నమ్మకంతో స్టార్స్‌ అవకాశాలు ఇస్తున్నప్పటికి వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అవుతున్నాడు. గత సంవత్సరం ఈయనకు బాలయ్య ఆఫర్‌ ఇచ్చాడు. పైసా వసూల్‌ చిత్రాన్ని బాలయ్యతో తెరకెక్కించి బాబోయ్‌ ఇదేం సినిమారా బాబు అనేలా చేశాడు.

బాలయ్య సినిమా తర్వాత పూరి తన కొడుకుతో ‘మెహబూబా’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ సినిమా కూడా డిజాస్టర్‌గా నిలిచింది. పెట్టుబడిలో కనీసం 20 శాతం వసూళ్లను కూడా రాబట్టలేక పోయింది. ఆ సినిమా వల్ల పూరి ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి సమయంలో పూరితో సినిమా చేసేందుకు ఏ హీరో అయినా, నిర్మాత అయినా భయపడాల్సిందే. కాని నాగార్జున మాత్రం పూరిపై నమ్మకంతో సినిమాను చేసేందుకు ముందుకు వచ్చాడు. అచ్చు బాలయ్య మాదిరిగానే పూరిపై నమ్మకంతో ఒక సినిమా చేసి చూద్దామనే అభిప్రాయంతో డేట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతుంది.

ప్రస్తుతం నాగార్జున ఒక మల్టీస్టారర్‌ చిత్రాన్ని నానితో కలిసి చేస్తున్నాడు. శ్రీరామ్‌ ఆధిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వస్తుంది. మరో వైపు నాగార్జున నటించిన ‘ఆఫీసర్‌’ చిత్రం విడుదలకు రెడీ అయ్యింది. ఇలా నాగార్జున వరుసగా చిత్రాలు చేస్తూ పూరికి కూడా ఆఫర్‌ ఇచ్చాడు. సక్సెస్‌ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా నాగార్జున మీడియం బడ్జెట్‌ చిత్రాలను చేయాలని నిర్ణయించుకున్నాడు. పూరిపై నమ్మకంతో మినిమం సక్సెస్‌ చిత్రాన్ని తనకు ఇస్తాడని నాగార్జున నమ్ముతున్నాడు.

గతంలో నాగార్జున, పూరిల కాంబినేషన్‌లో ‘శివమణి’ మరియు ‘సూపర్‌’ చిత్రాలు వచ్చాయి. రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. సూపర్‌ సినిమా వచ్చి దశాబ్ద కాలం అయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబో మూవీకి రంగం సిద్దం అయ్యింది. నాగార్జున బాడీలాంగ్వేజ్‌ మరియు వయస్సుకు తగ్గ ఒక కథను పూరి సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది. స్టోరీలైన్‌ చెప్పగానే నాగార్జున ఇంప్రెస్‌ అయ్యి తప్పకుండా చేద్దాం అంటూ హామీ ఇచ్చాడు. త్వరలోనే బ్యాంకాక్‌ వెళ్లి పూర్తి స్క్రిప్ట్‌ను రెడీ చేసుకుని పూరి రాబోతున్నాడు. ఆగస్టు వరకు సినిమాను ప్రారంభించి, ఇదే సంవత్సరంలో విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. మరి పూరికి నాగార్జున ఇచ్చిన ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకునేనా చూడాలి.