అవన్ని పుకార్లే అయితే అసలు నిజం ఏంటీ క్రిష్‌     2018-07-19   16:02:45  IST  Sai Mallula

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విద్యాబాలన్‌ బసవతారకం పాత్రలో కనిపించబోతుంది. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం తర్వాత బాలకృష్ణ మరియు క్రిష్‌ల కాంబోలో మూవీ తెరకెక్కబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి తోడు ఈ చిత్రంలో హేమా హేమీలు కనిపించబోతున్నట్లుగా మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్న కారణంగా, సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. తాజాగా చిత్రం గురించి వస్తున్న పుకార్లపై క్రిష్‌ క్లారిటీ ఇచ్చాడు.

దర్శకుడు క్రిష్‌ గత కొన్ని రోజులుగా సినిమా గురించి సోషల్‌ మీడియాలో మరియు వెబ్‌ మీడియాలో వస్తున్న పుకార్లు నిజం కావని, ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తలను కొట్టి పారేశాడు. శ్రీదేవి పాత్ర కోసం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను, కృష్ణ పాత్రకు మహేష్‌బాబును, చంద్రబాబు నాయుడు పాత్ర కోసం రానాను ఇంకా ప్రముఖ పాత్రల్లో టాలీవుడ్‌ స్టార్స్‌ను నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ వచ్చిన వార్తలు అన్ని పుకార్లే అని, అసలు అలాంటి ఆలోచనే లేదు అంటూ దర్శకుడు తేల్చి చెప్పేశాడు.

Director Krish Reveals About NTR Biopic Starter-

Director Krish Reveals About NTR Biopic Starter

‘ఎన్టీఆర్‌’ చిత్రంలో మహేష్‌బాబు, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, రానా, రాజశేఖర్‌ వంటి స్టార్స్‌ ఉంటే సినిమా స్థాయి అమాంతం పెరిగేది. కాని దర్శకుడు తాజాగా చేసిన ప్రకటనతో ప్రేక్షకులు నీరుగారి పోయారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రంలో వారు లేక పోవడం వల్ల పెద్దగా ఆసక్తి ఉండే అవకాశం లేదని అంతా భావిస్తున్నారు. ఇక సావిత్రి పాత్ర కోసం కీర్తి సురేష్‌ను ఎంపిక చేసినట్లుగా వస్తున్న వార్తలు కూడా నిజం కాదని తేలిపోయింది.
ఈ చిత్రం కోసం భారీ ఎత్తున కొత్త వారిని ఎంపిక చేయడం జరిగింది. ప్రముఖుల పాత్రలకు గాను కొత్త వారిని నటింపజేస్తారనే టాక్‌ వినిపిస్తుంది. ఆ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. కొత్త వారితో సినిమా చేయడం కంటే స్టార్స్‌ను స్టార్స్‌ పాత్రలో చూపిస్తే మరింతగా ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి క్రిష్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, అసలు ఏయన్నార్‌, చంద్రబాబు నాయుడు, సావిత్రి, శ్రీదేవి పాత్రల్లో ఎవరు కనిపిస్తారు అనేది త్వరలోనే తేలిపోయే అవకాశం ఉంది.