జేడీ ఫౌండేషన్ వారిద్దరి మధ్య దూరం పెంచిందా ?  

Differences Between Pawan And Jd Lakshmi Narayana-

జనసేన పార్టీలో అధినేత పవన్ కళ్యాణ్ తరువాత ఆ స్థాయిలో చరిష్మా ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది సీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ. 2019 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసిన ఆయన విజయాన్ని అందుకోలేకపోయారు. అయినా జనాల్లో జేడీ గారి పలుకుబడి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అయితే కొద్ది రోజులుగా లక్ష్మి నారాయణ జనసేన ను వీడి బీజేపీలో చేరబోతున్నారని పెద్ద ఎత్తున పుకార్లు బయలుదేరాయి..

జేడీ ఫౌండేషన్ వారిద్దరి మధ్య దూరం పెంచిందా ?-Differences Between Pawan And JD Lakshmi Narayana

దీనికి తగ్గట్టుగానే ఆయన కూడా జనసేన అధినేత పవన్ ఆధ్వర్యంలో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాలకు కూడా దూరంగా ఉండడంతో జేడీ గారి పార్టీ మార్పు ఖాయం అని అంతా అనుకున్నారు. అయితే చాలాకాలంగా ఇటువంటి వార్తలు పెద్ద ఎత్తున వస్తుండంతో జేడీ స్పందించాడు. తాను బీజేపీలోకి వేళున్నననే వార్తలు అసత్యం అని, జనసేనలోనే ఉన్నానని, ఉంటానని క్లారిటీ ఇచ్చాడు.

అసలు జనసేన పార్టీకి లక్ష్మి నారాయణ ఎందుకు అంటీ ముట్టనట్టుగా ఉన్నాడు ? పవన్ కి ఆయనకు ఏ విషయంలో మనస్పర్థలు వచ్చాయి ? ఇలా అనేక ప్రశ్నలు సామాన్య జనాల్లో కూడా తలెత్తాయి. విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి, ఓటమిపాలైన తర్వాత కూడా పలు కీలక జనసేన సమావేశాలకు హాజరయ్యారు జేడీ లక్ష్మీనారాయణ. అంతేకాకుండా విశాఖ నియోజకవర్గంలో చాలా వరకు పార్టీ తరఫున అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారు.

కానీ నిన్న మొన్నటి వరకు పార్టీలో ఒక కీలక నేతగా ఉన్న జేడీ లక్ష్మీనారాయణ, ఇపుడు మౌనం వహిస్తుండటం, అనేక ప్రచారాలకు తావిస్తోంది. జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తర్వాత, జేడీ లక్ష్మీనారాయణ అనేక కార్యక్రమాలు విశాఖలో నిర్వహించారు. అయితే ఆ కార్యక్రమాల్లో ఎక్కడా జనసేన ప్రస్తావన కానీ, జెండా కానీ లేకుండా సొంత అజెండాతో జేడీ వెళ్లడంతో ఆయన జనసేన కు దూరంగా జరిగారనే వార్తలకు బలం చేకూర్చింది.

అంతే కాకుండా ఈ మధ్యకాలంలో జనసేన పార్టీ తరపున వివిధ కమిటీలను పవన్ నియమించారు. అయితే అందులో లక్ష్మి నారాయణకు చోటు దక్కలేదు. దీంతో అలిగిన జేడీ పార్టీ మారాలనుకుంటున్నట్టు కూడా వార్తలు వినిపించాయి. కానీ కమిటీల్లో స్థానం లేకపోవడానికి జేడీ తీరు కూడా ఒక కారణంగా పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

అంతేకాకుండా జేడీ ఫౌండేషన్ కోసం జనసేన కార్యకర్తలను సైతం జేడీ లక్ష్మీనారాయణ వాడుకున్నారు అంటూ పార్టీలో చర్చ సాగుతోంది. పార్టీ కార్యక్రమాలకు జన సైనికులును ఉపయోగించుకోవాల్సిన ఆయన జేడీ ఫౌండేషన్ కోసం వినియోగించడంపై, పార్టీలోని కొంతమంది కీలక నేతలు, అధినేత పవన్‌ కల్యాణ్‌ కు ఫిర్యాదు చేశారట. అందుకే జేడీ విషయంలో పవన్ కళ్యాణ్ సైతం మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది..

ఆయన పార్టీలో ఉండాలనుకుంటే ఉంటారని, లేకపోతే వెళ్ళిపోతారు తప్ప పార్టీ పరంగా ఆయన విషయంలో పెద్దగా స్పందించకపోవడమే బెటర్ అన్నట్టుగా పవన్ ఉన్నాడట.