తెలంగాణ ఎన్నికలు: గుడ్లగూబలకు గడ్డు కాలం !  

తెలంగాణాలో ఎన్నికలు రావడం ఏంటి..? గుడ్ల గూబలకు గడ్డు కాలం రావడం ఏంటి అని ఆలోచిస్తున్నారా ..? అవును నిజమే తెలంగాణాలో ఎన్నికల సందర్భంగా గుడ్ల గూబలకు మంచి డిమాండ్ ఏర్పడింది. వాటిని లక్షలు వెచ్చించి మరీ…తెలంగాణాలో కొంతమంది అభ్యర్థులు కొనుగోలు చేస్తున్నారు.ఇంతకీ ఇదంతా ఎందుకు అంటే… గుడ్లగూబను, దాని చూపును అపశకునానికి సంకేతంగా భావిస్తుంటారు. అవి ఇంట్లోకి ప్రవేశిస్తే చెడు జరుగుతుందని భయపడుతుంటారు. అలాంటి గుడ్లగూబలను ప్రత్యర్థులపై ప్రయోగించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని కొందరు ప్రయత్నిస్తుండడం సంచలనంగా మారింది.

Demand For Owls In Telangana Elections-

Demand For Owls In Telangana Elections

కర్ణాటక నుంచి తెలంగాణకు రెండు గుడ్లగూబలను తీసుకొస్తున్న ఆరుగురిని పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి కోరిక మేరకే రెండు గుడ్లగూబలను తీసుకెళ్తున్నట్టు వారు పోలీసు విచారణలో అంగీకరించారు. ఒక్కో గుడ్లగూబకు 3, 4 లక్షల రూపాయల వరకు చెల్లించినట్టు తెలుస్తోంది. గుడ్లగూబను చంపి దాని రక్తం, శరీర భాగాలను ప్రత్యర్థుల ఇంటి ముందు పడేస్తే వారిని దురదృష్టం వెంటాడుతుందనే నమ్మకంతోనే భారీ స్థాయిలో అంత సొమ్ము వెచ్చించి మరీ తెప్పించి తమ ప్రత్యర్థుల మీదకు గుడ్ల గూబ అస్థ్రాన్ని వదులుతున్నారు. దీంతో గుడ్ల గూబలకు గడ్డుకాలం ఏర్పడింది.