తెలంగాణ కాంగ్రెస్ లో అలకలు, లుకలుకలు, గ్రూపు రాజకీయాలు సర్వ సాధారణంగా మారిపోయాయి.ఎప్పుడూ ఏదో ఒక అంశం పై ఎవరో ఒకరు వివాదం రేపుతూ ఉంటారు.
అలాగే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం వంటివి కాంగ్రెస్ లో సర్వసాధారణంగా మారిపోయాయి.తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి ఏ విధంగా తీసుకురావాలనే విషయాలను పక్కనపెట్టి అంతర్గతంగా ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నించడం, తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అలకపాన్పు ఎక్కడం తెలంగాణ కాంగ్రెస్ లో సర్వసాధారణంగా మారిపోయాయి.
తాజాగా మరో కాంగ్రెస్ సీనియర్ నేత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో పాటు, గాంధీభవన్ కు రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత , ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా ఉన్న దామోదర రాజనర్సింహ అలక చెందినట్లుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనకు తగిన విధంగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని, తాను చైర్మన్ గా ఉన్న అంశాల విషయంలోనూ తనకు సరైన సమాచారం ఇవ్వకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని రాజనరసింహ ఆగ్రహంగా ఉన్నారట.ఏ విషయంలోనూ రేవంత్ రెడ్డి సంప్రదింపులు చేయకపోవడంతో కలత చెందిన రాజనరసింహ గాంధీభవన్ కు రావడమే మానేశారట.
ఇక ధరణి సమస్యలపైన చర్చించేందుకు దామోదర రాజ నర్సింహ ఆధ్వర్యంలో గతంలో ఓ కమిటీని నియమించారు.ఈ మీటింగ్ లకు సైతం ఆయన హాజరు కాకపోవడంతో , ఆయన లేకుండానే ఈ సమావేశాలు మిగతా సభ్యులు ముగించేస్తున్నారట.రేవంత్ రెడ్డి తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఇప్పటికే అనేకమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీ తో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తుండగా,.ఇప్పుడు ఆ టీం లోకి రాజనరసింహ కూడా చేరినట్టు గా కనిపిస్తున్నారు.