బీజేపీ కొంప మునగబోతోందా..? ఆ సర్వే ఏం తేల్చింది..?       2018-06-09   22:03:03  IST  Bhanu C

కేంద్ర అధికార పార్టీ బీజేపీలో కంగారు మొదలయ్యింది. వచ్చే ఎన్నికల్లో కూడా అధికారం మాదే అన్నట్టు బిల్డుప్ ఇచ్చిన ఆ పార్టీకి అసలు సినిమా ఎలా ఉండబోతుందో అర్ధం అయ్యింది అందుకే ఇప్పుడు కలవరపాటుకు గురవుతోంది. బీజేపీ అంతర్గతంగా చేయించుకున్న సర్వేలో దిమ్మతిరిగే విషయాలు బయటపడ్డాయట.ఈ సర్వే ఫలితాల ప్రకారం ఆ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ గెలిచిన 282 స్థానాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఇందులో కనీసం 152 సీట్లలో బీజేపీపై ఓటర్లు గుర్రుగా ఉన్నారట.ఇప్పుడు ఇదే కమలనాథులను కంగారు పెడుతోంది.

సర్వే ఫలితాలను బట్టి బీజేపీకి కేవలం 132 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందట. ఇప్పటికే ఉత్తరాదిలో ఆ పార్టీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. బీజేపీ విజయానికి బాటలు వేసిన ఉత్తరప్రదేశ్‌లో గత ఎన్నికల్లో బీజేపీ 71 పార్లమెంట్ సీట్లను గెలుచుకుంది. కానీ ఈసారి మాత్రం అక్కడ 48 సీట్లు కోతపడబోతున్నాయని సర్వేలో తేలింది. ప్రముఖ హిందీ దినపత్రిక దైనిక్‌ భాస్కర్‌ కథనాన్ని ప్రచురించింది. సర్వే ఫలితాలు చూసి నష్టనివారణ చర్యలు జరుపుతున్నారు. పార్టీలో తృతీయస్థాయి నాయకత్వాన్ని కూడా మెరుగుపరచాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అభిప్రాయపడుతోంది.

పార్టీలో మోస్ట్ సీనియర్ లీడర్లు అయిన అద్వాణీ, మురళీ మనోహర్‌ జోషీ, కల్‌రాజ్‌మిశ్రా, భగత్‌షింగ్‌ కోషియారీ, బీసీ ఖండూరీకి మళ్లీ ప్రాధాన్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. వీరికి దేశ రాజకీయాల్లో గట్టి పట్టు ఉండటంతో పాటు ఓటర్ల ఆదరణ ఎక్కువగా ఉంది. గతంలో రాజస్థాన్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, దిల్లీ, గుజరాత్‌.. రాష్ట్రాల్లోని అన్ని లోక్‌సభ సీట్లను బీజేపీ గెలుచుకుంది. అయితే రానున్న ఎన్నికల్లో ఇక్కడ కమలానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.

తాజాగా జరిగిన కైరానా ఉప ఎన్నిక ఫలితమే ఇందుకు ఉదాహరణ. రాజస్థాన్‌లోని అజ్మేర్‌, అల్వార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌, ఫూల్పూర్‌ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో అగ్రనేతలు ఏపీ , తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ పై దృష్టిపెట్టారు. ఈ రాష్ట్రాల్లో మొత్తం 105 సీట్లు ఉండగా గత ఎన్నికల్లో బీజేపీ కేవలం ఆరు స్థానాలనే గెలుచుకుంది. మొత్తంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా బీజేపీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నట్టు అర్ధం అవుతోంది. అందుకే మోదీ, అమిత్ షా ఇద్దరిలోనూ మునుపెన్నడూ లేని భయం, ఆందోళన స్ప్రష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే అంటారు సవరం అయితే కానీ వివరం రాదని.